Begin typing your search above and press return to search.

రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఆవేశపూరిత ప్రసంగం - వాకౌట్

By:  Tupaki Desk   |   12 July 2019 4:24 PM GMT
రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఆవేశపూరిత ప్రసంగం - వాకౌట్
X
తనను అప్రతిహతంగా గెలిపించిన బీసీల రుణాన్ని జగన్ తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా టీడీపీ వెంట ఉన్న బీసీల ఓటింగ్ ను ఎన్నికల్లో తన వైపు తిప్పుకున్న జగన్ ఇప్పటికే అత్యధిక మంత్రి పదవులు ఇచ్చి వారిని సంతోషపెట్టాడు. బడ్జెట్ విషయంలోనూ భారీ కేటాయింపులే చేశారు. అయినా... ఇంకా ఇంకా వైసీపీ బీసీల ప్రేమ కోసం తపిస్తూనే ఉంది. పార్లమెంటుతో పాటు అన్ని చట్టసభల్లో బీసీలకు దామాషా పద్ధతిన (అంటే జనాభా నిష్పత్తికి అనుగుణంగా) రిజర్వేషన్లు కల్పించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కేవలం డిమాండ్ తో సరిపెట్టకుండా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్లమెంట్‌ లో ఏకంగా దీనిపై ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు.

శుక్రవారం ఈ బిల్లుపై చర్చకు పెట్టడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. ఆయన ప్రతిపాదించిన బిల్లుకు ఉత్తరాది పార్టీలతో పాటు మెజారిటీ రాజకీయ పార్టీలు మద్దతును ప్రకటించాయి. బిల్లుపై ఓటింగ్‌ జరపాలని తొలుత విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు. అయితే బిల్లుపై స్పందించిన కేంద్రన్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌.. అది రాజ్యాంగ సవరణ బిల్లు అని - సభలో సగం మంది సభ్యులు ఉంటేనే ఓటింగ్ - చర్చ సాధ్యమని బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనిని విజయసాయి రెడ్డి నిరాకరించారు. ఎట్టిపరిస్థితుల్లో కూడా బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తేలేదని - చర్చకు పట్టుబట్టారు. నిబంధనలు ఒప్పుకోవని మంత్రి స్పస్టంచేశారు.

దీనిపై ఆవేదనాగ్రహాలు వ్యక్తంచేసిన విజయసాయిరెడ్డి తాను ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టేటపుడే ఎందుకు అభ్యంతరం తెలపలేదని ప్రశ్నించారు. ఇపుడు ఓటింగ్ సమయంలో ఎందుకు అడ్డు చెబుతున్నారని నిలదీశారు. ప్రభుత్వమే బిల్లును మరింత సమగ్రంగా ప్రవేశపెడతామని హామీ ఇస్తే వెనక్కు తీసుకుంటానని అన్నారు. అయితే దానికి మంత్రి అంగీకరించకపోవడంతో విజయసాయిరెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన పార్లమెంటులో కేంద్రంపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 60 శాతం పదవులు వెనుకబడిన ఎస్సీ - ఎస్టీ - బీసీలకే ఇచ్చిందని - కేంద్రం కూడా బీసీలకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. బీసీలకు దేశంలో సమన్యాయం జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.