Begin typing your search above and press return to search.

చంద్ర‌న్న మాల్స్ గుట్టు విప్పిన ఫైర్ బ్రాండ్‌

By:  Tupaki Desk   |   13 Dec 2017 7:49 AM GMT
చంద్ర‌న్న మాల్స్ గుట్టు విప్పిన ఫైర్ బ్రాండ్‌
X
మాట్లాడే విష‌యం మీద సాధికార‌త‌.. అన్ని కోణాల్లో మాట్లాడ‌టం అంత తేలికైన విష‌యం కాదు. మామూలు విష‌యాలు వేరే. కానీ.. రాజ‌కీయాల గురించి.. అందునా ప్ర‌త్య‌ర్థి పార్టీ అధినేత‌ను ఉద్దేశించి మాట్లాడ‌టం.. విమ‌ర్శ‌నాస్త్రాల్ని ఎక్కు పెట్ట‌టం అంత ఈజీ కాదు. అయితే.. ఏపీవిప‌క్ష ఫైర్ బ్రాండ్ క‌మ్ మ‌హిళా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట‌లు వింటే మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయి. ఆమె చేసే విమ‌ర్శ‌లు వాడీ వేడిగా ఉండ‌ట‌మే కాదు.. ఆమె మాట‌ల్ని చాలా ఈజీగా అందిపుచ్చుకొని అధికార‌ప‌క్షంపై దునుమాడేలా ఉంటాయి

తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు ఆర్కే రోజా. ఏపీలో ఘ‌నంగా ప్రారంభించిన చంద్ర‌న్న మాల్స్ గుట్టు విప్పారు. విలేజ్ మాల్స్ పేరుతో ప్ర‌జ‌ల‌ను దోచుకునేందుకు వీలుగా చంద్ర‌బాబు కుట్ర చేస్తున్నార‌న్నారు. మ‌ళ్లీ సీఎం అవుతానో లేదో అన్న భ‌యంతోనే 21 ప‌థ‌కాల‌కు త‌న పేరును చంద్ర‌బాబు పెట్టుకున్నార‌న్నారు.

పేద‌ల‌పై ప్రేమ‌తో నాటి సీఎం ఎన్టీఆర్ కిలో బియ్యం రూ.2 ఇచ్చార‌ని.. చంద్ర‌బాబు ఈ ప‌థ‌కానికి తూట్లు పొడుస్తున్నార‌న్నారు. కార్పొరేట్ శ‌క్తుల‌కు.. నోట్ల క‌ట్ట‌ల‌కు పుట్టిన బిడ్డ‌గా చంద్ర‌బాబు పాల‌న సాగుతుంద‌న్నారు. చంద్ర‌న్న విలేజ్ మాల్స్ పేరుతో పేద‌ల పొట్ట కొట్టేలా ఏర్పాటు చేస్తున్నార‌న్నారు.

చౌక‌గా నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందించకుండా మాల్స్ పేరుతో ప్ర‌జ‌ల్ని .. చిన్న వ్యాపారుల క‌డుపు కొడుతున్నార‌న్నారు. దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రి చేయ‌ని రీతిలో ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అడ్డుపెట్టుకొని చిన్న చిన్న వ్యాపారులను దెబ్బ తీసేలా చంద్ర‌బాబు చేస్తున్నారంటూ ద‌య్య‌బ‌ట్టారు. చంద్ర‌న్న మాల్స్ చంద్ర‌బాబు కుటుంబానికి వాటాలున్న ప్యూచ‌ర్ గ్రూప్‌న‌కు.. వాళ్ల‌కు స‌న్నిహితంగా ఉండే రిల‌య‌న్స్ గ్రూపున‌కు క‌ట్ట‌బెట్టార‌న్నారు. ఈ మాల్స్ కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఏమైనా ఉప‌యోగం ఉందా? అని ప్ర‌శ్నించిన రోజా.. గ‌తంలో రేష‌న్ షాపుల ద్వారా 9 ర‌కాల వ‌స్తువులు ఇచ్చేవార‌ని.. వాటిని ర‌ద్దు చేసి కొర్పారేట్ కంపెనీల‌కు క‌ట్ట‌బెట్టారంటూ త‌ప్పు ప‌ట్టారు.

చంద్ర‌న్న మాల్స్ లో 5 శాతం నుంచి 35 శాతం మేర వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ఇస్తార‌ని చెబుతున్నార‌ని.. అయితే లాభాలు లేకుండా ఫ్యూచ‌ర్ గ్రూప్ సంస్థ వ‌స్తువుల్ని ప్ర‌జ‌ల‌కు ఎందుకు అమ్ముతుంద‌ని ప్ర‌శ్నించారు. రేష‌న్ షాపుల్ని నిర్వీర్యం చేసేందుకే చంద్ర‌బాబు స‌ర్కారు కుట్ర ప‌న్నుతోంద‌న్నారు. పేద‌ల‌పై నిజంగా ప్రేమ ఉంటే.. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల్ని బ‌హిరంగ మార్కెట్లో త‌గ్గేలా ఎందుకు చేయ‌టం లేద‌ని ప్ర‌శ్నించారు. రోజా చేసిన తీవ్ర ఆరోప‌ణ‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. చంద్ర‌న్న మాల్స్ పేరుతో హ‌డావుడి చేస్తున్న చంద్ర‌బాబు తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం.