Begin typing your search above and press return to search.

భారీ వ‌ర్షంలో టెంట్లు కూలినా దీక్ష ఆప‌లేదు

By:  Tupaki Desk   |   9 April 2018 5:22 AM GMT
భారీ వ‌ర్షంలో టెంట్లు కూలినా దీక్ష ఆప‌లేదు
X
ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో భాగంగా త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ కు త‌మ రాజీనామా ప‌త్రాల్ని ఇచ్చేసిన ఎంపీలు నేరుగా ఏపీ భ‌వ‌న్ కు చేరుకొని ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

దీక్ష మొద‌లెట్టిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే భారీ ఈదురుగాలుల కార‌ణంగా.. ఏపీ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన దీక్షా స్థ‌లి వ‌ద్ద‌నున్న టెంట్లు కూలాయి. పాక్షికంగా మ‌ళ్లీ టెంట్ల‌ను ఏర్పాటు చేశారు. మ‌ళ్లీ పెద్ద ఎత్తున ఈదురుగాలులు.. భారీ వ‌ర్షాల కార‌ణంగా దీక్షా స్థ‌లి వ‌ద్ద టెంట్లు కూలాయి.

వ‌ర్షం.. చలితో పాటు ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్ని లెక్క చేయ‌కుండా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు దీక్ష కొన‌సాగిస్తున్నారు. వీరి దీక్ష‌కు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. దీక్ష ప్రారంభించిన త‌ర్వాత తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన మేక‌పాటి.. వ‌ర‌ప్ర‌సాద్ ల‌ను బ‌లవంతంగా ఆసుప‌త్రికి త‌ర‌లించిన వైనం తెలిసిందే.

తాజాగా ఏపీ భ‌వ‌న్ లో దీక్ష కొన‌సాగిస్తున్న వైవీ సుబ్బారెడ్డి.. మిథున్ రెడ్డి.. అవినాష్ రెడ్డిల ఆరోగ్యం క్ర‌మ క్ర‌మంగా క్షీణిస్తోంది. ముగ్గురిలో వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించిన‌ట్లు వైద్యులు చెబుతున్నారు. సోమ‌వారం ఉద‌యం సుబ్బారెడ్డిని ప‌రీక్షించిన డాక్ట‌ర్లు ఆయ‌న పూర్తిగా డీహైడ్రేష‌న్ కు గురైన‌ట్లు వెల్ల‌డించారు. వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం ఏమీ బాగోలేద‌ని.. ఆయ‌న వెంట‌నే దీక్ష‌ను విర‌మించాల‌ని చెబుతున్నారు. అయితే.. తాను దీక్ష విర‌మించేది లేద‌ని వైవీ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. దీక్ష‌లో అనారోగ్యానికి గురైన మేక‌పాటి.. వ‌ర‌ప్ర‌సాద్ ల‌కు ఆసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు.