Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ పార్టీ ఎంపీల ఆమ‌ర‌ణ‌దీక్ష షురూ!

By:  Tupaki Desk   |   6 April 2018 10:27 AM GMT
జ‌గ‌న్ పార్టీ ఎంపీల ఆమ‌ర‌ణ‌దీక్ష షురూ!
X
ఏపీకి ప్ర‌త్యేక‌హోదా సాధ‌న కోసం పోరాడుతున్న ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో త‌న ఆందోళ‌న‌ల్ని చేప‌డుతోంది. కేంద్రంపై ఒత్తిడిని పెంచ‌టంతో పాటు.. ఊపిరి ఆడ‌నివ్వ‌ని రీతిలో వ్యూహాల్ని అమ‌లు చేస్తోంది. లోక్ స‌భ స‌మావేశాల ఆఖ‌రి రోజున‌.. స‌భ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన వెంట‌నే త‌మ ఎంపీలు పద‌వుల‌కు రాజీనామా చేస్తార‌న్న జ‌గ‌న్ మాట‌కు త‌గ్గ‌ట్లే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేస్తూ స్పీక‌ర్ కు రాజీనామా ఫార్మాట్ లో లేఖ‌లు అంద‌జేశారు.

అనంత‌రం ఎంపీలు మేక‌పాటి.. వైవీ సుబ్బారెడ్డి.. వ‌ర‌ప్ర‌సాద్‌.. అవినాశ్ రెడ్డి.. మిథున్ రెడ్డిలు నేరుగా ఏపీ భ‌వ‌న్ కు వ‌చ్చి ఆమ‌ర‌ణ‌దీక్ష‌లో కూర్చున్నారు. వీరి దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. ఇత‌ర నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఏపీ భ‌వ‌న్ కు చేరుకున్నారు.

త‌క్ష‌ణ‌మే ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఆమ‌ర‌ణ దీక్ష‌ను స్టార్ట్ చేయ‌టానికి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు అంబేడ్క‌ర్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. అనంత‌రం హోదా సాధ‌న కోసం ప్రాణాలు అర్పించిన ఐదుగురు అమ‌రుల చిత్ర‌ప‌టాల‌పై పూలు చ‌ల్లారు. నివాళులు అర్పించారు. అనంత‌రం దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. హోదా సాధ‌న కోసం మొద‌లైన జ‌గ‌న్ పార్టీ ఎంపీల ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌.. కేంద్రానికి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.