Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ దెబ్బ‌కు వేడెక్కిన హ‌స్తిన‌

By:  Tupaki Desk   |   2 April 2018 4:33 AM GMT
జ‌గ‌న్ దెబ్బ‌కు వేడెక్కిన హ‌స్తిన‌
X
ప్ర‌త్యేక హోదా సాధ‌న‌లో మొద‌ట్నించి ఒకే స్టాండ్ తో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. త‌న ల‌క్ష్య‌సాధ‌న‌లో ఎప్పుడూ డైవ‌ర్ట్ కాలేదు. ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌ల‌తో పాటు.. లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానం పెట్టే విష‌యంలో మాట‌ల్లోఏం చెప్పిందో.. చేత‌ల్లో అదే చేసి చూపించింది.

గ‌డిచిన కొద్దిరోజులుగా మోడీ స‌ర్కారుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కొంద‌రు స‌భ్యులు స‌భ‌లో ఆందోళ‌న చేయ‌టం.. వారిని సాకుగా చూపించి స‌భ‌ను వాయిదా వేయ‌టం ద్వారా అవిశ్వాసం స‌భ‌లో చ‌ర్చ‌కు రాకుండా చేస్తున్న ప‌రిస్థితి. ఇలాంటి వేళ‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.

లోక్ స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగినా.. జ‌ర‌గ‌కున్నా.. ఈ స‌భ ముగిసే చివ‌రి రోజున ఎంపీలు త‌మ స‌భ్య‌త్వాల‌కు రాజీనామా చేసి.. నేరుగా ఏపీ భ‌వ‌న్ కు వ‌చ్చి ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌ని ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్ర‌క‌ట‌న భారీ సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. హ‌స్తిన రాజ‌కీయమంతా ఒక్క‌సారిగా వేడెక్కింది. మంట పుట్టిస్తున్న ఎండ తీవ్ర‌త‌కు.. ఏపీ రాజ‌కీయం మరింత మంట పుట్టేలా చేసింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఏపీ హోదా సాధ‌న‌లో భాగంగా మోడీ స‌ర్కారుపై అవిశ్వాస బాణాన్ని గురి పెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తాజాగా తీసుకున్న నిర్ణ‌యం దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే తొలిసారి చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఒక అంశంపై ఒక పార్టీకి చెందిన ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి.. ఆ వెంట‌నే ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్ట‌టం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేద‌ని చెబుతున్నారు. దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఇది కొత్త చ‌రిత్ర సృష్టించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌తో మోడీ స‌ర్కారు అలెర్ట్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌పై ఢిల్లీలోని ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లు క‌లిసినా దీని గురించి చ‌ర్చించుకోవ‌టం క‌నిపిస్తోంది. ఒక పార్టీకి చెందిన ఎంపీలంతా త‌మ ప‌ద‌వుల్ని ప‌ణంగా పెట్టి.. ఒక డిమాండ్ కోసం ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌లేదంటున్నారు. ఎంపీలు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన త‌ర్వాత ప‌రిస్థితులు ఎలా మార‌తాయ‌న్న‌ది ఊహ‌కు అంద‌టం లేద‌న్న మాట ప‌లువురు విశ్లేష‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రిని ఉలిక్కిప‌డేలా చేసింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.