Begin typing your search above and press return to search.

ఆహ్వానం పంపి రోజాను అవమానించిన సీఎం?

By:  Tupaki Desk   |   11 Feb 2017 7:41 AM GMT
ఆహ్వానం పంపి రోజాను అవమానించిన సీఎం?
X
అంతా సాఫీగా సాగుతున్న వేళ.. ఏదో ఒక వివాదాన్ని నెత్తిన వేసుకోవటం ఎలా అన్నది ఏపీ సర్కారుకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. తాజాగా ఏపీ విపక్ష ఎమ్మెల్యే ఆర్కే రోజా విషయంలో చోటు చేసుకున్న తాజా పరిణామాలే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు జగన్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు ఆహ్వానాన్ని పంపారు.

దాన్ని అందుకున్న ఆమె ఈ రోజు (శనివారం) ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు వచ్చారు. షెడ్యూల్ ప్రకారం.. ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి ‘మురళీ ఫార్చ్యూన్’ హోటల్ కు వెళ్లి.. అక్కడ ఫ్రెష్ అయ్యాక సదస్సుకు వెళ్లాల్సి ఉంది. అయితే.. ఎయిర్ పోర్ట్ లో ఆమెను అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆమెను ప్రత్యేక వాహనంలో ఒంగోలు వైపునకు తీసుకెళ్లటం గమనార్హం.

ఎమ్మెల్యేగా మహిళా పార్లమెంటు సదస్సులో పాల్గొనే అనుమతి తనకున్నప్పటికీ.. పోలీసులు అడ్డుకొని.. నిర్బంధంగా వాహనంలోవేరే చోటుకు తరలిస్తున్న వైనాన్ని రోజా తీవ్రంగా తప్పు పడుతున్నారు. తనకు ఆహ్వానం పంపటం వల్లే తాను వచ్చానని.. కానీ.. ఇలా అడ్డుకోవటం ఏమిటని ఆమె ప్రశ్నిస్తున్నారు. విమానాశ్రయంలో తనను అడ్డుకున్నప్పుడు ఎందుకని అడిగితే.. దలైలామా వస్తున్నారంటూ.. లాంజ్ లో కూర్చోబెడుతున్నట్లుగా చెప్పారన్నారు. అక్కడే చాలాసేపు వెయిట్ చేయించి.. ఆ తర్వాత మహిళా పోలీసులతో నిండిన వాహనంలో తనను తీసుకెళుతున్నట్లుగా ఆమె చెప్పారు.

రోజాకు ఎదురైన అవమానంపై పలువురు తప్పు పడుతున్నారు. ఒకవేళ.. ఆమె కారణంగా ఇబ్బంది అనుకుంటే..ఆహ్వానం పంపకుంటే బాగుండదని.. అలా కాకుండా పిలిచి మరీ అవమానించటం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా సాధికారత కోసంవచ్చే ఒక మహిళా ఎమ్మెల్యేను అవమానించటం గమనార్హం.