Begin typing your search above and press return to search.

మహానాడు కంటే మించిపోవాలంట

By:  Tupaki Desk   |   5 July 2022 5:55 AM GMT
మహానాడు కంటే మించిపోవాలంట
X
2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా రానున్న ప్లీన‌రీకి సంబంధించి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మ‌హానాడుకు ఏ మాత్రం తీసి పోని విధంగా వైఎస్సార్ జ‌యంతి రోజున ప్లీన‌రీ జరపాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. అటుపై రెండు రోజుల పాటు జ‌రిగే వేడుక‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్య‌క‌ర్త‌లు హాజర‌వుతారు. పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ విచ్చేస్తార‌ని, ఇందులో ఎటువంటి అపోహ‌ల‌కు తావే లేద‌ని ప్ర‌భుత్వ పెద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి అంటున్నారు.

ఇక సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో మొన్న‌టి వేళ తాత్కాలిక పీఎంఓను ఓ డేరాలో ఏర్పాటు చేసి అక్క‌డి నుంచే కార్య‌కలాపాలు నిర్వహించారు సంబంధిత సిబ్బంది. అదేవిధంగా సీఎం జ‌గ‌న్ కూడా త‌న ప్లీన‌రీ జ‌రిగే వేళ రెండ్రోజుల పాటు నాగార్జున యూనివ‌ర్శిటీ ప్రాంగ‌ణానే ఉండిపోవాల్సి వ‌స్తుండ‌డంతో ఆయ‌న కూడా తాత్కాలికంగా సీఎంఓను ఇక్క‌డ ఏర్పాటు చేయించాల‌ని భావిస్తున్నారు. ఈ నెల 8,9 తేదీల‌లో జ‌రిగే ఈ ప్లీన‌రీకి సంబంధించి అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి.

ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ చెప్పే మాట‌లు, ముఖ్యంగా కార్య‌క‌ర్త‌ల‌కు అందించే వరాలు ఏంట‌న్న‌వి కీల‌కం కానున్నాయి. అదేవిధంగా ప్లీన‌రీ ప్రాంగ‌ణాన్ని అధునాతన ప‌ద్ధ‌తిలో తీర్చిదిద్దుతున్నారు. వాన ప‌డినా ఇబ్బంది త‌లెత్త‌కుండా ఉండేందుకు స‌భా ప్రాంగ‌ణాన్ని తీర్చిదిద్దుతున్నారు. మొత్తం ఆరు ల‌క్ష‌ల మంది ఈ స‌భ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.వారికి భోజ‌న, వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు సంబంధిత ఏర్పాట్ల‌న్నీ పార్టీ అధినాయ‌క‌త్వ‌మే చేస్తోంది.

అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్ర స్థాయిలో జ‌రుగుతున్న ప్లీన‌రీ కావ‌డంతో స‌హ‌జంగానే కాస్త ఎక్కువ ఆస‌క్తే ఉంటుంది. ఆ విధంగా ఈ సారి ప్లీన‌రీలో కూడా చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తే బాగుంటుంది అన్న ప్ర‌తిపాద‌న‌లు కూడా న‌డుస్తున్నాయి.

వీలున్నంత వ‌ర‌కూ కార్య‌క‌ర్త‌ల బాధ‌ల‌ను త‌గ్గించేందుకు, అదేవిధంగా పార్టీ ప‌రంగా భ‌రోసా ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి ప్ర‌య‌త్నిస్తే బాగుంటుంది అన్న వాద‌న కూడా ఉంది. ముఖ్యంగా పెండింగ్ బిల్లుల క్లియ‌రెన్స్ కు ప్రాధాన్యం ఇస్తే చాలు అని చాలా మంది కార్య‌క‌ర్త‌లు అంటున్నారు. అప్పుడు కొత్త ప‌నులు చేప‌ట్టి గ్రామాల్లో త‌లెత్తుకు తిరగ‌గ‌లం అని అంటున్నారు.