Begin typing your search above and press return to search.

అతడికి స్టేషన్ బెయిల్.. నామినేషన్ వేశాకే అరెస్టు

By:  Tupaki Desk   |   14 March 2020 4:57 AM GMT
అతడికి స్టేషన్ బెయిల్.. నామినేషన్ వేశాకే అరెస్టు
X
ఏపీలో ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏపీలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విపరీత ఘటనలు చోటు చేసుకుంటున్నా.. చర్యలు విషయంలో ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తగ్గట్లే.. ఏపీ హైకోర్టు గడిచిన రెండురోజులుగా చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమని చెబుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్ష టీడీపీ అభ్యర్థుల్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడికి వెళ్లిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమలు కారులో వెళ్లగా.. అందరూ చూస్తుండగానే.. కారు అద్దాల్ని దుడ్డుకర్రతో పగులకొట్టి.. లోపలున్న నేతలపై దాడికి యత్నించిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన విజువల్స్ టీవీ చానల్స్ లో పెద్ద ఎత్తున టెలికాస్ట్ అయ్యాయి.

అయితే.. ఈ ఉదంతానికి సంబంధించి ఏపీ అధికారపక్షనేతలు చేసిన కవరింగ్ అబద్ధమని తేలిపోయింది. బుద్దా.. బొండాలు ప్రయాణిస్తున్న వాహనం యాక్సిడెంట్ చేసిందని.. దాన్ని అడ్డుకున్న స్థానికులు ఆగ్రహంతో దాడులు చేసినట్లుగా చెప్పినా.. అదంతా ఉత్తమాట అని తేలిపోయింది. యాక్సిడెంట్ చేసినట్లుగా ఉన్న ఫోటోలు కొన్నేళ్ల క్రితం జరిగినట్లుగా తేలింది. బుద్దా.. బొండా లు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ చేస్తే.. ఆ కారుపైనా.. డ్రైవర్ పైనా యాక్సిడెంట్ కేసు నమోదు చేయాల్సి ఉన్నా.. అలా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

టీడీపీ నేతలు ప్రయాణిస్తున్న కారుపై దుడ్డు కర్రతో దాడి చేసిన ఉదంతానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన యువజన నేత తురకా కిశోర్ కారణమని గుర్తించారు. ఇందులో భాగంగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనూహ్యంగా స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల్లో తురకా కిశోర్ తన నామినేషన్ ను దాఖలు చేశారు. దాడి వ్యవహారంలో టీడీపీ న్యాయవాది తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో వెల్లువెత్తుతున్న విమర్శల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో శుక్రవారం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆ కేసులో కిశోర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. కాకుంటే. నేతల కారు మీద అందరూ చూస్తుండగానే దుడ్డు కర్రతో దాడి చేసిన వ్యక్తి నామినేషన్ వేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.