Begin typing your search above and press return to search.

ధనిక రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంది సారూ?

By:  Tupaki Desk   |   16 Aug 2019 7:17 AM GMT
ధనిక రాష్ట్రంలో ఈ దరిద్రం ఏంది సారూ?
X
మనకేంది? మనకేం తక్కువ. మనది ధనిక రాష్ట్రం. నిధుల కోసం కిందామీదా పడిపోవాల్సిన అవసరం లేదు. పది.. ఇరవై కోట్లు ఎక్కువైనా ఫర్లేదు.. మనకు తగ్గట్లే మన అవసరాల్ని తీర్చుకుందామంటూ భరోసాతో కూడిన బడాయి మాటలు తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి వస్తుంటాయి. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు.. రైతులకు నగదు సాయం.. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు.. ఒక మిషన్ భగీరధ.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని సంక్షేమ పథకాలకు కేరాఫ్ అన్నట్లుగా నిలుస్తారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

మరి.. అలాంటి ఆయన రాజ్యంలో పేదలు అత్యవసర వైద్య సేవల కోసం.. ఉచిత శస్త్రచికిత్సలు చేసే విధంగా రూపొందించిన ఆరోగ్య శ్రీ సేవలు.. తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోవటం షాకింగ్ గా మారింది. తెలంగాణ రాష్ట్రంలోని 242 కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేస్తూ నిర్ణయాన్నితీసుకున్నారు. ఈ పథకానికి సంబందించి ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో.. కార్పొరేట్ యాజమాన్యాలు ఈ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి.

తమకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల్ని చెల్లించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ఎలాంటి స్పందన లేకపోవటంతో.. బిల్లుల్ని మంజూరు చేసే వరకూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల్ని నిలిపివేయాలని నిర్ణయించారు. ధనిక రాష్ట్రంగా గొప్పలు చెప్పుకునే కేసీఆర్ సర్కారు.. నెలల తరబడి బిల్లులు చెల్లించకుండా ఉండటం ఏమిటి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ధనిక రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే పథకాన్ని ఆపివేయాలన్నంత పెద్ద నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నట్లు? అన్నది ఒక ప్రశ్న అయితే.. ఈ నిర్ణయంతో ఇప్పటికే వైద్య సేవలు పొందుతున్న పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు దాదాపు రూ.1500 కోట్ల వరకూ ఉన్నట్లు చెబుతున్నారు. బకాయిలు చెల్లించాలని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆందోళనకు దిగటం ఇప్పుడు సంచలనం మారింది. అయినా.. ధనిక రాష్ట్రంలో బిల్లుల బకాయిలు చెల్లించని దరిద్రం ఏంది కేసీఆర్ సార్?