Begin typing your search above and press return to search.

మెట్రో ప్రారంభంతో..వైఎస్ క‌ల నెర‌వేర‌బోతోందా?

By:  Tupaki Desk   |   27 Nov 2017 2:11 PM GMT
మెట్రో ప్రారంభంతో..వైఎస్ క‌ల నెర‌వేర‌బోతోందా?
X
హైద‌రాబాద్‌ లో ఇప్పుడు అంద‌రి క‌ళ్లు...మెట్రో ప్రారంభంపైనే అనే సంగ‌తి తెలిసిందే. న‌వంబ‌ర్ 28న ప్రారంభం కానున్న మెట్రో..29 నుంచి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే స్మార్ట్ కార్డుల అమ్మ‌కం కూడా పూర్త‌యిపోయింది. మ‌రోవైపు మెట్రో త‌మ ఘ‌న‌త అంటే..కాదు త‌మ ఘ‌న‌త అంటూ ఇటు అధికార‌ టీఆర్ఎస్ పార్టీ - అటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పేచీల్లో ప‌డ్డాయి. ఈ వాదోప‌వాదాలు ఎలా ఉన్నా న‌గ‌ర అభివృద్ధిని గ‌మ‌నించిన ప‌లువురు నిపుణులు మాత్రం..ఈ ఘ‌న‌త దివంగత‌ సీఎం వైఎస్ రాజశేఖ‌ర్ రెడ్డికి ద‌క్కుతుంద‌ని అంటున్నారు. ఇందుకు ప‌లు అంశాల‌ను క్ర‌మానుగ‌తంగా వివ‌రిస్తున్నారు.

2004లో ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన త‌ర్వాత సంక్షేమం - అభివృద్ధి అజెండాతో వైఎస్ఆర్ ముందుకు సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌గ‌రానికి వ‌న్నె తెచ్చే ప‌లు ప్రాజెక్టుల‌పై క‌స‌ర‌త్తు చేశారు. ఇందులో ఔట‌ర్ రింగ్ రోడ్‌ - ఐటీఐఆర్‌ - మెట్రో వంటివి ఒక‌టి. వైఎస్ ప‌రిపాల‌న ప‌గ్గాలు చేప‌ట్టే నాటికే హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ త‌న విశ్వ‌రూపం చూప‌డం మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో భ‌విష్య‌త్‌ను ఊహించిన వైఎస్ఆర్ మెట్రో రైల్ కోసం ప్ర‌ణాళిక‌లు వేశారు. అప్ప‌టికే క్రియాశీలంగా ముందుకు సాగుతున్న ఢిల్లీ మెట్రో రైలును ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుంటూ...ఆ విధానంలో ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైఎస్‌ఆర్‌ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ అధికారుల స‌ల‌హాలు, సూచ‌న‌లు కోరారు. వైఎస్ఆర్‌ ఆహ్వానం మేరకు 2005–07 మధ్యకాలంలో నగరంలో పర్యటించిన డీఎంఆర్‌సీ అధికారులు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. ఈ డీపీఆర్‌లో మొదటి దశలో మూడు కారిడార్లలో మొత్తం 73 కిమీ మేర ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఎల్బీనగర్‌ - మియాపూర్‌(29కిమీ) - జేబీఎస్‌-ఫలక్‌నుమా(15కిమీ), నాగోలు- రాయదుర్గం(29 కిమీ) మార్గాల్లో పనులు చేయాలని నిర్ణయించారు.

డీపీఆర్‌ తో మెట్రోకు ఒక‌రూపు ఇచ్చిన వైఎస్ఆర్ ఆ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అన్ని అనుమ‌తులు ఇప్పించేందుకు త‌న‌దైన శైలిలో కృషిచేశారు. ప్ర‌జా ర‌వాణాలో నూతన పోక‌డ‌ల‌కు వేదిక‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్ర‌క్రియ‌ల‌న్నీ పూర్తి చేసి 2008లో మెట్రో రైల్‌ను కూడా ప్రారంభించారు. అప్పుడు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా ఉన్న‌మేటాస్‌కు మెట్రో నిర్మాణ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అయితే మేటాస్ మాతృసంస్థ అయిన సత్యం కంప్యూట‌ర్స్ కార్పొరేట్ మోసాల్లో చిక్కుకుపోవ‌డం...ఆ మ‌కిలి మేటాస్‌కు సైతం అంటుకోవ‌డంతో...తిరిగి వైఎస్ స‌ర్కారే..2009లో ఆ టెండ‌ర్‌ను ర‌ద్దుచేశారు. ఆ త‌దుప‌రి గ్లోబ‌ల్ టెండ‌ర్లు ఆహ్వానించ‌గా...ఎల్ఆండ్‌టీ దాన్ని ద‌క్కించుకుంది. ఆ తదుప‌రి వైఎస్ మ‌ర‌ణం...ఇత‌ర‌త్రా అంశాల‌న్నీ తెలిసిన‌వే. స్థూలంగా..ఈనాటి హైద‌ర‌బాదీల క‌ల‌ల ప్ర‌యాణానికి...ఆనాడే దివంగ‌త వైఎష్ బీజం వేశార‌ని ప‌లువురు గుర్తు చేసుకుంటున్నారు.