Begin typing your search above and press return to search.

బీయారెస్ తో వైసీపీ పొత్తు....సజ్జల ఇంటరెస్టింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   12 Dec 2022 9:39 AM GMT
బీయారెస్ తో వైసీపీ పొత్తు....సజ్జల ఇంటరెస్టింగ్ కామెంట్స్
X
బీయారెస్ ఈ పేరు ఇపుడు ఏపీ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇంకా ఏపీలో అడుగు పెట్టని బీయారెస్ విషయంలో ఎవరికి వారు లెక్కలేసుకుంటున్నారు. రాజకీయ లాభాలను కూడా సరి చూసుకుంటున్నారు. ఇక బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇస్తే ఎవరికి దెబ్బ పడుతుంది అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది. వీటికి జవాబు వైసీపీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఇచ్చేశారు.

ఏపీలో బీయారెస్ పోటీ చేయడం మంచిది అని ఆయన అనడం ఈ సందర్భంగా గమనార్హం. అదే టైం లో ఏపీలో బీయారెస్ తరఫున మద్దతుని కేసీయార్ కోరితే అపుడు తమ పార్టీ ఆలోచన చేస్తుంది అని సజ్జల చెప్పడం కూడా ఆసక్తిని గొలిపే విషయం. ఎందుకంటే బీయారెస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం అంటూ జరిగితే దాని వల్ల వైసీపీకే మేలు అని ఒక వైపు చర్చ సాగుతూండగా దానికి ఊతమిచ్చేలా సజ్జల చేసిన ఈ కామెంట్స్ మరింతగా కొత్త చర్చకు ఆస్కారాన్ని ఇస్తున్నాయి.

పైగా కేసీయార్ మద్దతు అడితే జగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అని సజ్జల చెబుతున్నారు తప్ప కాదు కుదరదు అని ఎక్కడా ఖండించకపోవడం విశేషం. పైగా ఏపీలో చూస్తే ఏ ఒక్క విపక్షంతో వైసీపీకి పొడ గిట్టే సీన్ లేదు. కానీ కేసీయార్ బీయారెస్ తో అలా కాదు, కేసీయార్ జగన్ ల మధ్య ఉనన్ తెర వెనక దోస్తీ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం అంటారు. అయినా బీయారెస్ తో ఏపీలో వైసీపీ పొత్తు పెట్టుకుంటే అది రాజకీయంగా ఎవరికి ఎంత లాభం అన్నది కూడా చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఇక మరికొన్ని విషయాల్లో కూడా సజ్జల క్లారిటీ ఇచ్చారు. కర్నాటకలో తమ పార్టీ పోటీ చేస్తుందని, ఈ మేరకు అక్కడ సీనియర్ నేత గాలి జనార్ధనరెడ్డితో చర్చలు కూడా పూర్తి అయ్యాయని అన్న దాని మీద ఆయన మాట్లాడారు. వైసీపీ పూర్తిగా ఏపీకే అంకితం అయిన పార్టీ అని ఆయన అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి తమకు కావాలని ఆయన చెపుకొచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో పోటే అంటే ముందుగా తెలంగాణాలోనే పోటీ చేయవచ్చు కదా. అలాగే తమిళనాడులో కూడా పోటీకి దిగవచ్చు కదా అని ఆయన కొత్త పాయింట్ తీశారు.

ఎవరో భుజాలు ఎక్కి వారితో పొత్తు పెట్టుకుని వారి మద్దతుతో పోటీ చేయడం కొన్ని సీట్లు తెచ్చుకోవడం అనంది వైసీపీకి ఇష్టం లేని వ్యవహారం అని సజ్జల అంటున్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుని అధికారంలోకి వచ్చే ఆలోచన ఏదీ తమకు లేదని సజ్జల చెబుతున్నారు. అంటే కేవలం ఏపీ తప్ప మరే చోట వచ్చే ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదు అని ఆయన చెప్పినట్లు అయింది. ఇక ఇదే సమయంలో ఆయన సమైక్యాంధ్రా గురించి కూడా మళ్లీ కామెంట్స్ చేశారు.

ఉమ్మడి ఏపీ అలాగే ఉండాలని, సమైక్యాంధ్రాకే ఓటేసిన పార్టీ తమదని ఆయన గుర్తు చేశారు. అదే టైంలో ఏపీ రాష్ట్ర విభజన సరైన పద్ధతిలో జరగలేదు అని సజ్జల కీలక వ్యఖ్యలు చేశారు. ఇంతకాలం ఇదే మాటను మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతూ వచ్చారు. ఇపుడు ఇదే మాటను సజ్జల కూడా అంటున్నారు అంటే ఇది ఏమైనా ఎన్నికల వ్యూహంలో భాగమా అన్న చర్చ కూడా వస్తోంది మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.