Begin typing your search above and press return to search.

గుంటూరులో విచిత్రం.. వైఎస్సార్సీపీ- టీడీపీ జోడి

By:  Tupaki Desk   |   16 March 2020 7:15 AM GMT
గుంటూరులో విచిత్రం.. వైఎస్సార్సీపీ- టీడీపీ జోడి
X
ఆంధ్రప్రదేశ్ లో మొదట నుంచి ఉప్పు నిప్పుగా వైఎస్సార్సీపీ, టీడీపీ ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నాడు. రాష్ట్రంలో ఏ ఎన్నికలైనా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే జరుగుతుంటాయి. మరో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వరు. రాజకీయం లో ప్రధాన శత్రువులు ఎవరంటే ఆ రెండు పార్టీలే అని ఎవరైనా చెబుతారు. ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత ఉంటుంది. అలాంటి ఆ రెండు పార్టీలు విచిత్రంగా కలిసిపోయాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీని తుడిచేయాలనే లక్ష్యంతో జగన్ వ్యూహం రచిస్తుండగా దానికి భిన్నంగా గుంటూరులో టీడీపీ తో వైఎస్సార్సీపీ జత కలిసింది. పరస్పరం సహకరించుకోవడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామం గుంటూరు జిల్లాలో చోటుచేసుకోవడం గమనార్హం.

రాష్ట్రస్థాయి లో చంద్రబాబు, జగన్ ఢీకొంటుండగా క్షేత్రస్థాయి లో ఆ రెండు పార్టీల నాయకులు సహకరించుకుంటున్నారు. ఆ పరిణామమే గుంటూరు జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో జరిగింది. ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్సీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. వైఎస్సార్సీపీ తో కలిసి పోటీ చేయడాన్ని ముట్లూరు టీడీపీలోని ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే స్థానిక పరిస్థితుల ఆధారంగా ఆ విధంగా కలిసిపోయినట్టు మరో వర్గం టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ విషయమై టీడీపీ ఎంపీ జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లారంట. అంటే వైఎస్సార్సీపీకి పరోక్షంగా కొందరు టీడీపీ నాయకులు సహకరిస్తున్నారని తెలిపారు. అధికార పార్టీకి టీడీపీని మాజీ ఎంపీపీ పూనాటి రమేశ్ అమ్ముతున్నాడని మరో వర్గం టీడీపీ నాయకులు ఎంపీకి ఫిర్యాదు చేశారంట. ఈ పరిస్థితుల్లో మీరు రంగంలోకి దిగాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. టీడీపీ నాయకులు తమకు సహకరించుకునేలా వైఎస్సార్సీపీ వ్యూహం నడిపిందని, అందుకే ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ పరిణామం చోటుచేసుకుందని స్థానికంగా వినిపిస్తున్న మాట.