Begin typing your search above and press return to search.

పొద్దుపొద్దునే రంగంలోకి జగన్ బ్యాచ్

By:  Tupaki Desk   |   29 Aug 2015 4:08 AM GMT
పొద్దుపొద్దునే రంగంలోకి జగన్ బ్యాచ్
X
విభజన హామీలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించాలన్న డిమాండ్ తో కొద్దిరోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ పిలుపు ఇవ్వటం తెలిసిందే. తిరుపతిలో మునికోటి ఆత్మాహుతి తర్వాత ఇచ్చిన బంద్ పిలుపును శనివారం నిర్వహిస్తున్నారు. ఏపీ బంద్ తో రాష్ట్రంలోని ప్రజా జీవితం స్తంభించిపోయేలా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది.

దీనికి తగ్గట్లే ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు నేతలు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ మధ్య విజయవాడలో మాట్లాడిన వైఎస్సార్ కాంగ్రెస్ నేత జలీల్ ఖాన్.. బంద్ సందర్భంగా ఆర్టీసీ బస్సు కానీ రోడ్డు మీదకు వస్తే తుక్కు.. తుక్కు చేయాలంటూ పిలుపునివ్వటం తెలిసిందే.

సాధారణంగా బంద్ అంటే.. ఉదయం ఎనిమిది.. తొమ్మిది గంటలకు కానీ స్టార్ట్ కాదు. కానీ.. తాజా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంద్ మాత్రం ఉదయమే మొదలైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జగన్ బ్యాచ్ పొద్దుపొద్దున్నే రంగంలోకి దిగటంతో పలు జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు బయటకు రాలేదు. కొన్ని చోట్ల బయటకు వచ్చిన వాటిని వెనక్కి పంపేశారు.

తెల్లవారు జాము నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చేసి బంద్ ను షురూ చేశారు. ఇక.. జిల్లాల వారీగా బంద్ చిత్రాన్ని చూస్తే.. కడప జిల్లాలోని 8 డిపోల పరిధిలో 900 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. అన్ని బస్సు డిపోల వద్దా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు బస్సుల్ని అడ్డుకుంటున్నాయి. ప్రకాశం జిల్లాలోనూ బంద్ మొదలైంది.కొన్నిచోట్ల బస్సుల్ని అడ్డుకుంటున్నారు.

ఉత్తరాంధ్రలోని విజయనగరం.. శ్రీకాకుళంలలో బస్సుల రాకపోకలపై ప్రభావం పడింది. విజయనగరం జిల్లాలో ఏ డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో కొన్ని బస్సులు బయటకు రావటం. వాటిపై రాళ్లను రువ్వటంతో వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఇక.. తూర్పు, పశ్చిమ గావరి జిల్లాల్లోనూ బంద్ ప్రభావం బస్సుల మీద పడింది. చిత్తూరు.. కర్నూలు.. నెల్లూరు.. గుంటూరు.. కృష్ణా జిల్లాల్లోనూ బంద్ మొదలైంది. తొలి విడతగా బస్సులపై జగన్ బ్యాచ్ దృష్టి నిలపటంతో బస్సు రాకపోకలపై ప్రభావం పడింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. మొత్తంగా.. ఏపీలో ఉదయమే బంద్ షురూ అయ్యిందని చెప్పాలి.