Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ బస్సు : కిటికీ తెరిచి చూడండి మంత్రులారా !

By:  Tupaki Desk   |   27 May 2022 5:30 AM GMT
జ‌గ‌న్ బస్సు  : కిటికీ తెరిచి చూడండి మంత్రులారా !
X
సామాజిక న్యాయ భేరి పేరుతో ఏపీ మంత్రులంతా బ‌స్సు యాత్ర చేస్తున్నారు. ఇవాళ యాత్ర రాజ‌మండ్రికి చేరుకోనుంది. అక్క‌డ నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు సంబంధించి మంత్రులు 4 మాట‌లు చెప్ప‌నున్నారు. జ‌గ‌న్ పాల‌న‌లో సంక్షేమ ఫ‌లాలు ఏ విధంగా అందుతున్నాయ‌న్న‌ది వివ‌రిస్తూనే, సామాజిక న్యాయం ఏ విధంగా అందుతోంది.. ఏ విధంగా దానిని అప్లిక‌బుల్ చేస్తున్నాం అన్న‌ది చెప్పే ప్ర‌య‌త్నం ఒక‌టి మంత్రులు చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో కొన్ని వాస్త‌వాలు చ‌ర్చించుకుంటే ఈ ప్ర‌భుత్వం హయాంలో బీసీల‌కు ద‌క్కిన హామీలు వాటి నెర‌వేర్పు ఏంట‌న్న‌వి తెలిసి వ‌స్తాయి.

మంత్రి ధ‌ర్మాన చెబుతున్న విధంగానో లేదా మంత్రి జోగి ర‌మేశ్ చెబుతున్న విధంగానో ఇక్క‌డ సామాజిక విప్ల‌వం అయితే లేదు. సామాజిక విప్ల‌వం అనే ప‌దానికి తూగే ప‌నులు ఏవీ జ‌ర‌గ‌డం లేదు. అలాంట‌ప్పుడు ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి సామాజిక విప్ల‌వ కారుడు అని ఎలా అంటారు.? ఒక జ్యోతీరావు పూలే మాదిరిగా ఏ సంస్క‌ర‌ణ వాదం ఆంధ్రావ‌నిలో అమ‌లు అయి లేదు. వీలున్నంత వ‌ర‌కూ డ‌బ్బులు పంచుకుంటూ వెళ్తున్నారు. అది ఆర్థిక సూత్రం. సామాజిక సూత్రం కాదు. సామాజిక న్యాయం అంత‌కన్నా కాదు. సామాజిక న్యాయం అంటే వెనుక‌బ‌డిన కులాల‌కు ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు పుష్క‌లంగా ద‌క్కే విధంగా చేసి., ఈ ప్ర‌భుత్వం దృష్టిలో అంద‌రూ స‌మాన‌మే అని చాటుకోవ‌డం. నిరూపించ‌డం కూడా ! కానీ అవేవీ ఇప్పుడు జ‌ర‌గ‌డం లేదు.

వాస్త‌వానికి ఇర‌వైకి పైగా ప‌థ‌కాల‌ను రద్దు చేసి మా పొట్ట కొట్టార‌ని ద‌ళిత సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. అదేవిధంగా ఈ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చేక ఇంత‌వ‌ర‌కూ ఏపీపీఎస్సీ నుంచి ఒక్కటంటే ఒక్క నోటిఫికేష‌న్ లేదు. గ‌తంలో ప్ర‌భుత్వ హ‌యాంలో న‌డిచే కుట్టు ట్రైనింగ్ సెంట‌ర్లు ఇప్పుడు లేవు. ఏ విధంగా చూసుకున్నా ఉపాధి క‌ల్ప‌న‌కు చ‌ర్య‌లే లేవు. కేవ‌లం కొన్ని ప‌థ‌కాల పేరిట అది కూడా అర్హులంద‌రికీ కాదు కానీ కొంద‌రికి మాత్ర‌మే వాటిని అందిస్తూ చేస్తున్న ప్ర‌య‌త్నం లేదా పాల‌న‌ను ఎలా సామాజిక న్యాయం కింద ప‌రిగ‌ణిస్తాం అన్న‌ది అంతుపోల‌ని విష‌యం.