Begin typing your search above and press return to search.

పెద్దిరెడ్డికి చెప్పులు చూపించిన వైసీపీ క్యాడర్

By:  Tupaki Desk   |   17 Dec 2022 11:30 AM GMT
పెద్దిరెడ్డికి చెప్పులు చూపించిన వైసీపీ క్యాడర్
X
ఆయన సీనియర్ మోస్ట్ నేత. ఏడు పదుల వయసు దాటిన వారు. జగన్ తరువాత పార్టీలో అంతటి నాయకుడు అని పేరు తెచ్చుకున్నారు. రాయలసీమ రాజకీయాల్లో తలపండిన పెద్దిరెడ్డి ఆ రీజియన్ కి వైసీపీ తరఫున రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన బలమైన నాయకుడు. అంగబలం అర్ధ బలంతో పాటు అన్ని విధాలుగా శక్తిమంతుడు అని వైసీపీలో టాక్.

అంతటి బలవంతుడికి ఇపుడు సొంత పార్టీ నుంచే అవమానాలు ఎదురవుతున్నాయి వైసీపీ శ్రేణులే పెద్దాయనకు ఎదురు నిలిచి చెప్పులు చూపిస్తే ఇక ఆయన పరువు ఏం కావాలి. ఈ సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిర్వహిస్తున్న వైసీపీ విస్తృత స్థాయిల్ సమావేశానికి పెద్దిరెడ్డి హాజరవుతున్నారు.

అయితే పార్టీలో ఉన్న అసమ్మతి నేతలు ఆయన రాకను తెలిసి ఏకంగా కాన్వాయ్ ని 44వ నంబర్ జాతీయ రహదారి వద్ద అడ్డుకున్నారు. స్థానిక ఎమెల్యే మాజీ మంత్రి అయిన శంకర్ నారాయణ మీద మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు అసమ్మతి నాయకులు అక్కడికి వచ్చారు. అయితే వారి కంటే ముందుగానే ఎమ్మెల్యే శంకర్ నారాయణ మద్దతుదారులు కూడా రావడంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెద్ద ఎత్తున రేగింది.

ఇలా రెండు వర్గాలు రోడ్డు మీద పడడంతో పోలీసులు వారిని వారించి అదుపు చెశారు. అయితే పెద్దిరెడ్డి అక్కడకు రాగానే మాత్రం అసమ్మతివాదులు కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఊగిపోయారు. మంత్రి కాన్వాయ్ కదలడానికి వీలు లేదు అంటూ పట్టుపట్టారు. అటూ ఇటూ ఎమ్మెల్యే అనుకూల వ్యతిరేక వర్గాల మధ్య వాదులాట స్టార్ట్ అయింది. ఆ సమయంలో మంత్రికి అసమ్మతి నాయకులు చెప్పులు చూపించి మండిపడడంతో పెద్దిరెడ్డి షాక్ తిన్నాల్సి వచ్చింది.

దీనికంటే ముందు కొద్ది రోజుల క్రితం హిందూపురం లో కూడా ఎమ్మెల్సీ ఇక్బాల్ ని పార్టీ అభ్యర్ధిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రమోట్ చేస్తున్నారు అంటూ ఆయన వ్యతిరేక వర్గాలు మంత్రి ఎదుట నిరసన తెలియచేసి రచ్చ చేశారు. ఇక్బాల్ కి ఏ మాత్రం ప్రజాభిమానం లేకపోయినా పెద్దిరెడ్డి ఆయన్ని పార్టీ అభ్యర్ధిగా చేయాలని చూడడమేంటని వారు అక్కడ నిలదీశారు.

ఇలా వరసగా వారం రోజుల వ్యవధిలో అనంతపురం పర్యటనలో సొంత పార్టీ వారే పెద్దిరెడ్డి ముందు నిరసలను వ్యక్తం చేయడం, ఏకంగా చెప్పులు చూపించడంతో పెద్దాయన పరేషాన్ అవుతున్నారు. ఒక వైపు చంద్రబాబుని కుప్పంలో ఓడిస్తాను అని బీరాలు పలుకుతున్న పెద్దిరెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలే సత్కారం చేస్తున్నారు అని టీడీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.