Begin typing your search above and press return to search.

జగన్ పార్టీ బంద్ తేదీని మార్చారు

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:47 PM GMT
జగన్ పార్టీ బంద్ తేదీని మార్చారు
X
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ అధినేత ఢిల్లీ వెళ్లి.. జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేయటం.. పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించటం.. ఈ సందర్భంగా ఆయన్ను అరెస్ట్ చేయటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వటం లేదంటూ.. తిరుపతికి చెందిన కోటి అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని ఆత్మాహుతి చేసుకొని మరణించిన నేపథ్యంలో.. ఏపీ బంద్ కు జగన్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 28న ఏపీ బంద్ కు జగన్ పిలుపునిచ్చారు. అయితే.. తాజాగా బంద్ తేదీని మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.

బంద్ తేదీని ఎందుకు మారుస్తున్నారంటే.. ఆసక్తికరమైన వాదనను వినిపించారు. ఆగస్టు 28న శ్రావణ శుక్రవారమని.. వరలక్ష్మీ వ్రతం ఉన్న కారణంగా. .మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టే పూజలకు బంద్ కారణంగా ఆటంకం కలుగుతుందని.. అందుకే ఆ రోజున తాము తలపెట్టిన బంద్ ను వాయిదా వేసినట్లుగా వెల్లడించారు. ఆగస్టు 28న కాకుండా.. ఆగస్టు 29న నిర్వహించనున్నట్లు చెప్పారు. అయినా.. బంద్ లాంటి వాటి తేదీలు నిర్ణయించేటప్పుడు క్యాలెండర్ చూడకుండా పిలుపు ఇచ్చేస్తారా..?