Begin typing your search above and press return to search.

సిస‌లైన గెలుపు వైసీపీదే!

By:  Tupaki Desk   |   22 March 2017 6:01 AM GMT
సిస‌లైన గెలుపు వైసీపీదే!
X
నిజ‌మేనండోయ్‌... ఏపీ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి అస‌లు సిస‌లైన గెలుపు విప‌క్ష వైసీపీదేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎందుకంటే ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో ఆ పార్టీ బ‌ల‌ప‌ర‌చిన అభ్య‌ర్థుల‌కు ప‌ట్ట‌భ‌ద్రులు ప‌ట్టం క‌ట్టారు. మొత్తం మూడు స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే... వాటిలో ఓ స్థానాన్ని అధికార ప‌క్షం చేజిక్కించుకోగా, మిగిలిన రెండు కూడా వైసీపీ అభ్యర్థుల‌కే ద‌క్కాయి. ఇక గెలిచిన ఒక్క సీటు కూడా నేరుగా టీడీపీ ఖాతాలో ప‌డ‌లేదు. ఓట‌మి భ‌యంతోనే బీజేపీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపిన టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు... త‌మ పార్టీ నుంచి మ‌ద్ద‌తు ఇచ్చారు. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌లంటేనే చంద్రబాబు హ‌డ‌లిపోతున్నార‌న‌డానికి ఈ త‌ర‌హా వ్యూహం నిద‌ర్శ‌నంగా నిలుస్తుంద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... ఏపీ శాస‌న‌మండ‌లిలో ఖాళీ అయిన మూడు గ్రాడ్యుయేట్స్ కోటా (ప‌ట్ట‌భ‌ద్రులు ఓట్ల‌తో భ‌ర్తీ అయ్యే సీట్లు) స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్స్ స్థానాన్ని టీడీపీ, బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థి పీవీఎస్‌ మాధ‌వ్ ద‌క్కించుకున్నారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, పీడీఎఫ్ అభ్య‌ర్థి అజా శ‌ర్మ‌పై 9,215 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ అజా శ‌ర్మ‌కు వైసీపీ మ‌ద్ద‌తు ప‌లికింది. చివ‌రి దాకా మాధ‌వ్‌కు గ‌ట్టి పోటీ ఇచ్చిన అజా శ‌ర్మ‌... ఒకానొక స‌మ‌యంలో మాధ‌వ్ కంటే కూడా అధికంగా ఓట్లు సాధించారు. అయితే క్ర‌మంగా మాధ‌వ్ పుంజుకోగా, బొటాబొటీ మెజారిటీతో ఆయ‌న విజ‌యం సాధించారు.

ఇక తూర్పు రాయ‌ల‌సీమ ప‌ట్ట‌భ‌ద్రుల స్థానంలో వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన పీడీఎఫ్ అభ్య‌ర్థి యండ‌వ‌ల్లి శ్రీనివాసులు రెడ్డి ఘ‌న విజ‌యం సాధించారు. ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున పోటీకి దిగిన వేమిరెడ్డి ప‌ట్టాభిరామిరెడ్డి ఓడిపోయారు. వేమిరెడ్దిపై శ్రీనివాసులురెడ్డి 3,500 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఇక్క‌డ మరో విష‌యాన్ని ప్ర‌స్తావించుకోవాలి. అదేంటంటే... ఈ స్థానం ప‌రిధిలో చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరు కూడా ఉంది. సొంత జిల్లా ఉన్న ఈ స్థానం నుంచి త‌న పార్టీ అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు చంద్ర‌బాబు చేయ‌ని య‌త్నమంటూ లేదు. అయితే విద్యావంతులైన గ్రాడ్యుయేట్స్ చంద్ర‌బాబు పాల‌న‌ను తిస‌ర్క‌రిస్తూ... వైసీపీ బ‌ల‌ప‌ర‌చిన పీడీఎఫ్ అభ్య‌ర్థికే ప‌ట్టం క‌ట్టారు.

ఇక ప‌శ్చిమ రాయ‌ల‌సీమ గ్రాడ్యుయేట్స్ స్థానం విష‌యానికి వ‌స్తే... అనంత‌పురం - క‌ర్నూలు - క‌డ‌ప జిల్లాల గ్రాడ్యుయేట్ ఓట్ల‌తో కూడిన ఈ స్థానాన్ని ఇటు అధికార పార్టీతో పాటు అటు విప‌క్ష వైసీపీ కూడా ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే భావించాయి. ఎన్నిక‌ల‌కు చాలా రోజుల స‌మ‌యం ఉండ‌గానే... ఈ స్థానం నుంచి వెన్న‌పూస గోపాల్ రెడ్డిని వైసీపీ త‌న అభ్య‌ర్థిగా బ‌రిలోకి దింపింది. వైసీపీ అభ్యర్థి ఖ‌రారైన చాలా రోజుల త‌ర్వాత గానీ ఇక్క‌డ టీడీపీ త‌న అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేక‌పోయింది. రోజుల త‌ర‌బ‌డి త‌ర్జ‌న‌భ‌ర్జ‌నల త‌ర్వాత పారిశ్రామిక‌వేత్త‌గానే కాకుండా, రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ప‌లు అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్న కేజే రెడ్డిని త‌న అభ్యర్థిగా ప్ర‌క‌టించింది.

ప్ర‌చారం హోరాహోరీగా సాగ‌గా... లెక్క‌లేనంత మేర సంప‌ద ఉన్న కేజే రెడ్డి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు డ‌బ్బుల‌ను విచ్చ‌ల‌విడిగా ఖ‌ర్చు చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాస్త‌వ ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ... టీడీపీ అప‌స‌వ్య పాల‌నపై ప్ర‌చారం చేసిన గోపాల్ రెడ్డి... ఓట‌ర్ల మ‌దిని దోచుకున్నారు. కాసేప‌టి క్రితం అనంత‌పురంలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా... టీడీపీ అభ్య‌ర్థి కేజే రెడ్డిపై 14,146 ఓట్ల భారీ మెజారిటీతో గోపాల్ రెడ్డి విజ‌యం సాధించారు. గ్రాడ్యుయేట్స్ కోటాలో జ‌రిగిన మూడు స్థానాల ఎన్నిక‌ల్లో న‌మోదైన అత్య‌ధిక మెజారిటీ వైసీపీ అభ్యర్థిదే కావ‌డం గ‌మ‌నార్హం. వెర‌సి ప్ర‌త్య‌క్ష్యంగానే కాకుండా విద్యావంతులుగా, వాస్త‌వ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసుకుని మ‌రీ ఓటేసే మ‌న‌స్త‌త్వం ఉన్న గ్రాడ్యుయేట్స్... తామంతా వైసీపీ వెంటే ఉన్న‌ట్లు ఈ ఎన్నిక ద్వారా తేల్చేసిన‌ట్టైంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/