Begin typing your search above and press return to search.

వ‌రుస పెట్టి విడుద‌ల కానున్న జ‌గ‌న్ పార్టీ జాబితాలు

By:  Tupaki Desk   |   12 March 2019 5:04 PM GMT
వ‌రుస పెట్టి విడుద‌ల కానున్న జ‌గ‌న్ పార్టీ జాబితాలు
X
ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా తొలి విడ‌త‌లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో రాజ‌కీయం వేడెక్కింది. తెలంగాణ‌తో పోలిస్తే ఏపీలో రాజ‌కీయం గ‌రం గ‌రంగా మారింది. మండే సూరీడుతో పోటీ ప‌డేలా రాజ‌కీయ వాతావ‌ర‌ణం హాట్ హాట్ గా మారిపోయింది.

పెద్ద‌గా టైం లేక‌పోవ‌టం.. మొత్తం ఎన్నిక‌ల ప్ర‌క్రియ నెల కంటే త‌క్కువ రోజుల‌కు త‌గ్గిపోవ‌టంతో రాజ‌కీయ పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌.. ఎన్నిక‌లకు స‌మాయుత్తం అయ్యేందుకు హ‌డావుడి ప‌డుతున్నాయి.

అభ్య‌ర్థుల్ని ఎంపిక చేస్తూనే.. ఆ సంద‌ర్భంగా చోటు చేసుకునే పంచాయితీల‌ను ప‌రిష్క‌రిస్తూ.. పార్టీలోని అన్ని విభాగాల‌ను ఎన్నిక‌ల‌కు స‌మాయుత్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నిక‌ల్లో అత్యంత కీల‌క‌మైన అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దాదాపుగా పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. బుధ‌వారం నుంచి వ‌రుస పెట్టి అభ్య‌ర్థుల జాబితాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం బుధ‌వారం నుంచి వ‌రుస‌గా మూడు.. నాలుగు రోజుల్లో మొత్తం అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న విడుద‌ల అవుతుంద‌ని చెబుతున్నారు. తొలి జాబితాలో 75 పేర్ల‌కు త‌గ్గ‌కుండా అభ్య‌ర్థుల పేర్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. రెండో జాబితాలో కూడా 75 మంది అభ్య‌ర్థులు.. కాస్త త‌క్కువ‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. మొత్తంగా మూడు.. నాలుగు విడ‌త‌ల్లో అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న పూర్తి అయ్యేలా జ‌గ‌న్ ప్లాన్ చేసిన‌ట్లు చెబుతున్నారు. టికెట్లను ఫైన‌ల్ చేసిన త‌ర్వాత బుజ్జ‌గింపుల ప‌ర్వం ఉన్నందున‌.. ఈ వారాంతంలోపే అభ్య‌ర్థుల ఎంపిక పూర్తి చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.