Begin typing your search above and press return to search.

కుప్పంలో పోటాపోటీ ఆందోళన రచ్చ.. సీఐని తోసేసిన వైసీపీ నేత

By:  Tupaki Desk   |   22 Oct 2021 3:30 PM GMT
కుప్పంలో పోటాపోటీ ఆందోళన రచ్చ.. సీఐని తోసేసిన వైసీపీ నేత
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత పట్టాభి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చోటు చేసుకున్న పరిణామాలు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో తెలిసిందే. టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లోని టీడీపీ కార్యాలయాలపై దాడికి పాల్పడటం తెలిసిందే. దీనిపై నిరసనగా చంద్రబాబు నిరసన దీక్ష చేస్తుంటే.. అందుకు పోటీగా అధికార వైసీపీ నేతలు భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.

రాష్ట్ర బంద్ ను పిలుపునిచ్చిన టీడీపీ ఎత్తుల్ని సాగకుండా వైసీపీ నేతలు పోటీ ఆందోళనలు చేపట్టటం తెలిసిందే. తెలుగు తమ్ముళ్లు రోడ్ల మీదకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటే.. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం రోడ్ల మీదకు వచ్చి టీడీపీకి వ్యతిరేకంగా నిరసనలు.. ఆందోళనలు.. మీడియా ముందు పచ్చి బూతులు తిట్టేలా కొందరు నేతలు రియాక్టు అయ్యారు. ఇదిలా ఉంటే.. శుక్రవారం కూడా ఏపీలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చోటు చసుకుంటున్నాయి.

ఇలాంటి వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇలాకా అయిన కుప్పంలో ఈ రోజు చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయి. ఒకవైపు అధికార వైసీపీ.. రెండో వైపు విపక్ష టీడీపీ నేతలు.. కార్యకర్తలు.. సానుభూతిపరులు రోడ్ల మీదకు వచ్చి ఒకరిపై ఒకరు ఘాటు విరమ్శలు చేసుకున్నారు. దీంతో.. పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీకి చెందిన శ్రేణులు రోడ్ల మదకు పెద్ద ఎత్తున చేరుకోవటంతో పోలీసులు వారిని అడ్డుకుంటూ చెదరగొట్టే ప్రయత్నం చేశారు.

అయితే.. ఈ క్రమంలో అనుకోని రీతిలో వైసీపీ శాంతిపురం వైసీపీ నేత కోదండరెడ్డి స్థానిక అర్బన్ సీఐను తోసేయటం.. ఆయన కింద పడటంతో.. అప్పటివరకు సహనంగా వ్యవహరించిన పోలీసులు ఒక్కసారిగా తమ లాటీలకు పని చెప్పారు. దీంతో. అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొందని చెబుతున్నారు. రాజకీయాల్లో పోటీ సహజమే అయినా.. మరీ ఈ స్థాయిలో రచ్చ అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.