Begin typing your search above and press return to search.

ఆ సీట్లలో వైసీపీ డ్యాం ష్యూర్ విక్టరీ.. టీడీపీ ఏం చేస్తోంది ...?

By:  Tupaki Desk   |   21 Oct 2022 11:30 PM GMT
ఆ సీట్లలో వైసీపీ డ్యాం ష్యూర్ విక్టరీ.. టీడీపీ ఏం చేస్తోంది ...?
X
ఏపీలో మొత్తానికి మొత్తం 175 సీట్లు గెలుచుకోవాలని జగన్ పట్టుదల పడుతున్నా అలాంటి సీన్ ఉండదని అందరికీ తెలిసిందే. ఏదో క్యాడర్ ని ఉత్సాహపరచడానికి జగన్ అంటున్నారు అనే అంతా భావిస్తారు. అయితే సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్లుగా ఒక్క సీటు కూడా కోల్పోకూడదు అని సీరియస్ గా కష్టపడితే మంచి విజయాలు నమోదు అవుతాయి. ఈ వ్యూహమే ఇపుడు వైసీపీ అమలు చేస్తోంది.

ఇదిలా ఉంటే వైసీపీ ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యాక కొన్ని సీట్లు ఆ పార్టీకి అలా దారాదత్తం అయిపోయాయి. వాటికి ఒక విధంగా టీడీపీ రాసి ఇచ్చేసిందా అన్న చర్చ కూడా సాగుతూనే ఉంది. చిత్రమేంటి అంటే ఈసారి ఏపీలో టీడీపీకి 160 సీట్లు పైన వస్తాయని చెప్పే ఆ పార్టీ పెద్దలు కనీసం ఈ సీట్ల విషయంలో సరైన ఫోకస్ కూడా పెట్టకపోవడం, పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేయడం వంటివి చేస్తున్నారు.

దాంతో ఈ సీట్లలో బేఫికర్ గా వైసీపీ గెలిచేస్తుంది అని అంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో చూసుకుంటే ఈ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడుతూ వచ్చాయి. ముచ్చటగా మూడవసారి ఈ సీట్లలో పాగా వేయడానికి వైసీపీ పెద్దగా ఆయాసపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఎందుకంటే టీడీపీ వీటిని గాలికి వదిలేసింది అని అదే పార్టీలో చర్చ సాగుతోంది.

మరి ఇంతలా వైసీపీ ఓడిలోకి వచ్చి పడుతున్న ఆ సీట్లు ఏంటో ఒక్కసారి కనుక చూస్తే రాయలసీమ, కోస్తా జిల్లాలలో ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నెల్లూరు జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు, పూతలపట్టు, కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, కోడుమూరు, కడప జిల్లాలో బద్వేల్, రైల్వేకోడూరు, ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, కృష్ణా జిల్లాలోని పామర్రు, తిరువూరుతోపాటు చింతలపూడి, పాడేరు, అరకు, రంపచోడవరం లాంటి సీట్లపై టీడీపీ ఎపుడో ఆశలు వదులుకుంది అంటున్నారు. ఇలాగే మరికొన్ని సీట్లు కూడా ఉన్నాయి.

అవి విజయనగరం జిల్లాలో సాలూరు, కురుపాం, శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, పాలకొండ వంటివి అన్న మాట. అలాగే మరికొన్ని సీట్లలో 2014లో ఓడినా కూడా 2019 నాటికి వైసీపీ గెలిచి పటిష్టం చేసుకుంది. ఈ సీట్ల విషయంలో టీడీపీ ఎలాంటి ఫోకస్ పెట్టకపోవడం జరుగుతోంది అంటున్నారు. దీని వల్ల ఎన్నికలతో సంబంధం లేకుండానే వైసీపీ ఖాతాలో పాతిక సీట్ల దాకా అలా వచ్చి పడిపోతున్నాయని అంటున్నారు. ఆ మీదట మ్యాజిక్ ఫిగర్ ని చేరడానికి అరవై సీట్లలో నిఖార్సుగా వైసీపీ ఫైట్ చేస్తే మళ్లీ పవర్ ఆ పార్టీదే అని అంటున్నారు.

ఇక ఈ విధంగా ఎందుకు జరుగుతోంది, టీడీపీకి అక్కడ బలం లేదా అంటే పార్టీని అభిమానించే వారు ఉన్నారు. మంచి ఓటింగ్ కూడా నమోదు అవుతోంది. కానీ నడిపించడానికి సరైన నాయకుడు అయితే ఆయా సీట్లలో లేరు అని అంటున్నారు. దాని వల్లనే వైసీపీకి ఇక్కడ దూకుడు ఎక్కువ అయిందని అంటున్నారు. మరో ఏణ్ణర్ధంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఈ సీట్ల మీద టీడీపీ దృష్టి పెడుతుందా లేక వీటిని అప్పనంగా వైసీపీకి రాసిచ్చేస్తుందా అన్నది చూడాలి. అదే జరిగితే మాత్రం అధికారం కోసం వైసీపీ మీద టీడీపీ కేవలం 150 సీట్లలోనే ఫైట్ చేయాల్సి వస్తుంది అన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.