Begin typing your search above and press return to search.

ఆ దూకుడే వైసీపీ మాజీ మంత్రిని కింద ప‌డేసిందా...!

By:  Tupaki Desk   |   6 Aug 2022 4:28 AM GMT
ఆ దూకుడే వైసీపీ మాజీ మంత్రిని కింద ప‌డేసిందా...!
X
అనిల్‌కుమార్‌ యాదవ్. మాజీ నీటిపారుదలశాఖా మంత్రి. మాట తూటాలు పేల్చే మంత్రిగా ఆయ‌న పేరు గడించారు. ఎంతోకాలం రాజకీయాల్లో ఉంటే కానీ సాధ్యంకాని విషయాలన్నీ అనిల్‌ చాలా త‌క్కువ కాలంలోనే సాధించేశారు. అలాగే అంతే వేగంగా కింద ప‌డిపోయార‌నే టాక్ వినిపిస్తోంది.

అనిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లో నెల్లూరులో ఆనంవారికి అనుచరు డిగా ఉండేవారు. ఆకుటుంబమే అనిల్‌ను అన్నివిధాలా ప్రోత్సహించింది. పైగా కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ కూడా ఇప్పించింది. అయితే.. అనూహ్యంగా ఆనం కుటుంబంతో ఆయ‌న వివాదానికి దిగి.. ఆ కుటుంబానికి దూరమయ్యారు.

తరువాత వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో ఏపని అడిగినా.. మనం అధికారంలో లేం... అధికారంలోకి వస్తే చిటికెలో చేసేస్తాననేవారు. 2019లో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. జగన్ కేబినెట్ లో కీలకమైన నీటిపారుదల శాఖామంత్రి అయ్యారు. ఇక జిల్లాలో నీటి ప్రాజెక్డ్ లన్నీ పరుగులు పెడతాయనుకున్నారు‌. అనిల్‌ కూడా ఇంటా బయటా ప్రతిపక్షాలపై విరుచుకుప‌డేవారు. అయితే.. కళ్లు మూసి కళ్లు తెరిచేలోపే... అనిల్ మూడేళ్ల మంత్రి పదవీ కాలం పూర్తయింది.

నెల్లూరు, సంగం బ్యారేజీల్లో మిగిలిన పది శాతం పనులను కూడా ఆయన తన హయాంలో చేయించలేకపోయారు. వరసగా రెండేళ్లు వచ్చిన‌ వరదలకి సోమశిల‌ డ్యాం దెబ్బతింది. కేంద్ర బృందాలు పలుమార్లు పరిశీలించి, వెంటనే మరమ్మతులు చేయాలని సూచించినా... దిక్కులేకుండా పోయింది. నగరంలో కాలువకట్టలమీద ఇళ్లు నిర్మించుకున్నవారికి పట్టాలిస్తామని హామీ ఇచ్చి, తరువాత ఇరిగేషన్ స్థలాల్లో పట్టాలు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని అర్ధమైపోయిందిట. దీంతో వెంకటగిరి నుంచి పోటీ చేయాలని భావించారట. ఇదే విషయాన్ని సీఎం జగన్ కి పదేపదే చెప్పారట. అందుకే మంత్రి పదవి ఊడిందనే చర్చ ఓ రేంజ్ లో సాగుతోంది. వెంకటగిరి నుంచి అనిల్ పోటీ చేయబోతున్నారని తెలియగానే.. స్థానికేతరలు మాకొద్దంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు వెల్లువెత్తాయి. దాంతో అనిల్ సైలెంట్ అయిపోయారు. మొన్నటిదాకా మా అనిల్ అన్న... మా అనిల్ అన్న... అంటూ ఓ రేంజ్ లో వీరాభిమానం చూపిన వారంతా అనిల్ కి దూరమవుతున్నారు.

నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాధ్ మొదటి నుంచి అనిల్ వెంట ఉన్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు మంత్రి పదవి దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి పూలబొకే ఇచ్చారు‌. అంతే ముక్కాలని అనిల్ దూరం పెట్టేశారు. మంత్రికి బొకే ఇస్తే తప్పేంటి?... పార్టీ స్టాండ్ లో నడుచుకోవడమే తప్పా?... అంటూ ముక్కాల అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు అనిల్ అంద‌రికీ కాని వాడిగా.. ఆయ‌న దూకుడే ఆయ‌న‌కు శ‌తృవుగా మారిపోయిందని అంటున్నారు ప‌రిశీల‌కులు.