Begin typing your search above and press return to search.

జగన్ సమావేశానికి వారెందుకు రాలేదు

By:  Tupaki Desk   |   14 Jun 2016 9:54 AM GMT
జగన్ సమావేశానికి వారెందుకు రాలేదు
X
వైసీపీ అధినేత జగన్ మొట్టమొదటిసారిగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో భారీ స్థాయిలో పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం మొదలైన ఈ సమావేశానికి రాష్ట్ర స్థాయి నేతల నుంచి మండల స్థాయి నేతల వరకు అందరూ భాగస్వాములయ్యారు. అయితే.. విజయవాడలో నిర్వహించిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం అనుమానాలకు దారితీస్తున్నా అందుకు కారణాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత పనులు - పర్యటనల కారణంగా సమావేశానికి నేతలు కొందరు గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. ఎంపీలు - ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు - జిల్లా అధ్యక్షులు - పార్లమెంటు నియోజకవర్గాలు - అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు - జడ్పీటీసీలు - ఎంపీపీల స్థాయి నేతల వదకు హాజరైన ఈ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.

ఎమ్మెల్యేలు అమరనాథ్ రెడ్డి - గిడ్డి ఈశ్వరి - రోజా - ముస్తఫా లు హాజరు కాలేదు. సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేశ్ కూడా గైర్హాజరయ్యారని ప్రచారం జరిగినా అది నిజం కాదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన సమావేశానికి వచ్చారని... అనంతరం ఇతర పనుల కారణంగా సమావేశం నుంచి వెళ్లారని చెబుతున్నారు. రోజా విదేశీ పర్యటనల్లో ఉండడం వల్ల హాజరు కాలేదు. విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆమె సోదరుడు మృతి కారణంగా రాలేకపోయారు.

అయితే.. ఇద్దరు నేతల విషయంలో మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాలేదని తెలుస్తోంది. అలాగే జగన్ సొంత జిల్లాలో ప్రొద్దటూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ ముఖ్య నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కూడా విజయవాడ రాలేదు. ఆయన జగన్ సమావేశానికి రాకపోగా ఈనాడు-ఈటీవీ చేపట్టిన ‘వన భారతి- జన హారతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరు తప్ప మిగతావారంతా వ్యక్తిగత పనుల కారణంగా రాలేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.