Begin typing your search above and press return to search.

వైసీపీ వైఫ‌ల్యం!..'యాత్ర‌' ను క్యాష్ చేసుకోలేక‌పోయింది!

By:  Tupaki Desk   |   15 Feb 2019 6:56 AM GMT
వైసీపీ వైఫ‌ల్యం!..యాత్ర‌ ను క్యాష్ చేసుకోలేక‌పోయింది!
X
వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా సాగుతున్నారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో వెంట్రుక వాసిలో అధికారాన్ని చేజార్చుకున్న జ‌గ‌న్‌... ఈ ద‌ఫా మాత్రం ఏపీ సీఎం పీఠాన్ని అధిరోహించాల్సిందేన‌ని - త‌న తండ్రి - దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సాగించిన సంక్షేమ పాల‌న‌ను తిరిగి రాష్ట్రంలో అమ‌లు చేయాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌డ‌చిన నాలుగున్న‌రేళ్లుగా త‌న‌దైన శైలి పోరు సాగిస్తున్న జగ‌న్‌... కొన్ని సంచ‌ల‌న నిర్ణ‌యాలు కూడా తీసుకున్నారు. తాను తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌పై ప్ర‌జ‌ల నుంచి ఓ మోస్త‌రు వ్య‌తిరేక‌త వ‌చ్చినా కూడా జ‌గ‌న్ వెన‌క‌డుగు వేసిన దాఖ‌లా లేదనే చెప్పాలి. మొత్తంగా త‌న‌కు తెలియ‌కో - లేదంటే తెలిసే జ‌రుగుతున్నాయో తెలియ‌దు గానీ... వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ కొన్ని పొర‌పాట్లు చేసుకుంటూ వెళుతున్నార‌న్న వాద‌న అయితే కాద‌న‌లేనిదే. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌గ‌న్‌ - ఆయ‌న పార్టీ నేత‌లు మ‌రో మంచి అవ‌కాశాన్ని చేజార్చుకున్నారన్న వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది.

జ‌గ‌న్ తండ్రి వైఎస్ జీవితంలో కీల‌క ఘ‌ట్టంగా పాద‌యాత్ర‌నే చెప్పుకోవాలి. మండుటెండ‌లో వైఎస్ ఉమ్మ‌డి రాష్ట్రంలో సాగించిన యాత్ర నిజంగానే చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌దేన‌ని చెప్పాలి. ఈ యాత్ర‌తోనే వైఎస్ అధికారంలోకి రావ‌డంతో పాటు సంక్షేమ పాల‌న అంటే ఏమిటో చేసి చూపించారు. అప్ప‌టిదాకా క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో సంక్షేమ పాల‌న‌కు వైఎస్ శ్రీ‌కారం చుట్ట‌డానికి ఆయ‌న చేప‌ట్టిన పాద‌యాత్ర‌నే దోహదం చేసింద‌ని చెప్పాలి. పాద‌యాత్ర‌లో రాష్ట్రంలోని దాదాపుగా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మైన వైఎస్‌... వారి సాధ‌క బాధ‌కాల‌ను చాలా ద‌గ్గ‌ర నుంచి చూశారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించాల‌న్న విష‌యంపై అక్క‌డిక‌క్క‌డే ఓ బ్లూప్రింట్‌ ను రూపొందించుకున్నార‌నే చెప్పాలి. పాద‌యాత్ర‌లో త‌న అనుభ‌వాల‌ను మ‌దిలో నిక్షిప్తం చేసుకున్న వైఎస్... అధికారంలోకి రాగానే ఒక్క‌టొక్క‌టిగా అమ‌లులోకి తీసుకొచ్చేశారు. మొత్తంగా సంక్ష‌మ పాల‌న అంటే ఎలా ఉండాలో చూపించిన వైఎస్‌... ఆ పాల‌న‌ను ప్ర‌జ‌ల మ‌దిలో చిర‌స్థాయిగా నిలిచిపోయేలా చేశారు.

ఇదే ఇతివృత్తంతో యువ ద‌ర్శ‌కుడు మ‌హీ. వి. రాఘ‌వ్ *యాత్ర* పేరిట సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఇప్పుడు తెలుగు నేల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌దర్శిత‌మ‌వుతోంది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఈ సినిమా మ‌రోమారు వైఎస్ ను గుర్తు చేసింది. సినిమాను చూసిన వారంతా.. మరోమారు వైఎస్‌ ను చూసిన‌ట్టుగా ఉంద‌ని కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా జ‌నాల్లో మంచి హైప్‌ ను క్రియేట్ చేసింది. ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కీల‌క స‌మ‌యంలో విడుద‌లైన ఈ సినిమా... వైసీపీకి ఓ మంచి మైలేజీని తీసుకొచ్చేసింద‌ని చెప్పాలి. అయితే ఈ మైలేజీని వినియోగించుకోవ‌డంలో మాత్రం వైసీపీ ఘోరంగా విఫ‌ల‌మైంద‌నే చెప్పాలి. వైఎస్ ఆశ‌య సాధ‌నే ధ్వేయ‌మ‌ని ప్ర‌క‌టించిన వైసీపీ.... వైఎస్‌ను జ‌నాల‌కు మ‌రోమారు గుర్తు చేసిన యాత్ర సినిమాను పట్టించుకోక‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఆ పార్టీకి చెందిన సినీ న‌టి ఆర్కే రోజా మాత్ర‌మే ఈ సినిమాపై స్పందిస్తే... మిగిలిన ఏ ఒక్క నేత కూడా స్పందించిన దాఖ‌లా లేదు.

తండ్రి అడుగుజాడ‌లే త‌న‌కు మార్గ‌మ‌ని చెప్పుకుంటున్న జ‌గ‌న్ గానీ, ఆయ‌న సోద‌రి వైఎస్ ష‌ర్మిల గానీ ఇప్ప‌టిదాకా ఈ సినిమా చూడ‌నే లేదు. ఒక్క విజ‌య‌మ్మ మాత్ర‌మే ఈ సినిమాను చూసి భావోద్వేగానికి గుర‌య్యారు. భార్య‌గా విజ‌య‌మ్మ త‌న భ‌ర్త ఇతివృత్తంతో తీసిన ఈ చిత్రాన్ని చూశార‌ని చెప్పాలి. అయితే పార్టీ ప‌రంగా ఈ సినిమా ద్వారా ల‌భించే మైలేజీని వైసీపీతో పాటు సాక్షి ప‌త్రిక కూడా స‌ద్వినియోగం చేసుకోలేదు. మొన్న‌టికి మొన్న టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బ‌యోపిక్ సంద‌ర్బంగా టీడీపీ నేత‌లు - ఆ పార్టీ అధినేత ఎంత హంగామా చేశారో తెలిసిందే క‌దా. అట్ట‌ర్ ప్లాఫ్ టాక్ తెచ్చుకున్న ఆ చిత్రం ద్వారా ఏ మేర మైలేజీ వ‌చ్చినా లాగేసుకునేందుకు టీడీపీ య‌త్నించింది. అయితే బంప‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న యాత్ర సినిమా మైలేజీని వైఎస్సార్ కాంగ్ర‌రెస్‌ ఎందుకు క్యాష్ చేసుకోలేక‌పోయార‌న్నది అంతు చిక్క‌ని ప్ర‌శ్నగానే మిగిలింది. వైసీపీలో, సాక్షి ప‌త్రిక‌లో ఈ త‌ర‌హా వైఖ‌రిపై పార్టీ అభిమానులు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.