Begin typing your search above and press return to search.

హరారే మ్యాచ్ లో ఆ జెండాల్సి చూశారా?

By:  Tupaki Desk   |   19 Jun 2016 4:22 AM GMT
హరారే మ్యాచ్ లో ఆ జెండాల్సి చూశారా?
X
ప్రస్తుతం జింబాబ్వేలో భారత జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టూర్ లో భాగంగా శనివారం టీ20 మ్యాచ్ జరిగింది. హరారేలో జరిగిన ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం పలువురి దృష్టిని ఆకర్షించింది. ఎక్కడో జింబాబ్వేలో జరుగుతున్న మ్యాచ్ లో ప్రేక్షకుల గ్యాలరీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులు పార్టీ జెండాల్ని.. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న టీషర్ట్ లను ధరించటం పలువురి దృష్టిని ఆకర్షించింది.

ఎక్కడో దేశం కాని దేశంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న కొంతమంది టీమిండియా అభిమానుల చేతుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా కనిపించటం టీవీ కెమేరాల దృష్టి వాటి మీద ఫోకస్ అయింది. ఈ మ్యాచ్ చూసిన తెలుగు క్రీడాభిమానులు కాస్తంత ఆశ్చర్యపోయేలా చేసిన ఈ ఉదంతం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రం తెగ సంతోషానికి గురి చేసిందనే చెప్పాలి.

దేశం కాని దేశంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ లో పార్టీ మీదా.. పార్టీ అధినేత మీద తమకున్న అభిమానాన్ని చూపించటం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే.. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల జెండాలు క్రికెట్ స్టేడియంలో కనిపించటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఎవరు మాత్రం తమ అభిమానాన్ని ప్రదర్శించకుండా ఉంటారు?అందులోకి ప్రత్యర్థి పార్టీ వారు షురూ చేసిన నేపథ్యంలో.. ఒకరికి మించి మరొకరు అన్న చందంగా క్రికెట్ మ్యాచులలో పోటాపోటీగా పార్టీజెండాలు ఊపేసినా ఇక ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో..?