Begin typing your search above and press return to search.

ట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీకి షాకిచ్చిన వైసీపీ

By:  Tupaki Desk   |   30 July 2019 10:21 AM GMT
ట్రిపుల్ తలాక్ బిల్లు: బీజేపీకి షాకిచ్చిన వైసీపీ
X
ఎంత దగ్గరి స్నేహం అయినా పార్టీ ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల ముందు తలొగ్గేది లేదని వైసీపీ నిరూపించింది. ఈ సందర్భంగా బీజేపీకి షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిషాత్మకంగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లును వైసీపీ వ్యతిరేకించి సంచలనం రేపింది.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై మంగళవారం రాజ్యసభలో చర్చ జరిగింది. అధికార బీజేపీ పార్టీకి చెందిన సభ్యులు దీన్ని సపోర్ట్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇతర సభ్యులు విమర్శలు గుప్పించి వ్యతిరేకించారు.

బీజేపీతో కొద్దిరోజులుగా దోస్తీ కడుతున్న వైసీపీ స్టాండ్ ఎలా ఉండబోతుందా అన్న ఉత్కంఠ ఉండేది. మంగళవారం చర్చలో పాల్గొన్న వైసీపీ పక్షనేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ట్రిపుల్ తలాక్ బిల్లుపై మాట్లాడారు. ముస్లింలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లును లౌకికవాదాన్ని పాటించే వైసీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ముస్లిం వివాహం సివిల్ కాంట్రాక్ట్ అని దీనిపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర ప్రవేశపెట్టిన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లులోని ఆరు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని విజయసాయిరెడ్డి వ్యతిరేకించడం విశేషం. చట్టంలోని లేని అంశాల ఆధారంగా ఇందులో కఠిన శిక్షలను ఎలా విధిస్తారని .. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

కాగా బీజేపీతో సాన్నిహిత్యం నెరుపుతున్న వైసీపీ మతపరమైన కోణంలో ముస్లింల పక్షపాతిగా తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీ ధైర్యాన్ని సూచిస్తోంది. మరి ఈ నిర్ణయం రెండు పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ పెంచుతుందనేది వేచి చూడాలి.