Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ క‌డ‌ప అసెంబ్లీ సీటును కొత్త వ్య‌క్తికి ఇస్తోందా?

By:  Tupaki Desk   |   27 July 2022 4:55 AM GMT
వైఎస్సార్సీపీ క‌డ‌ప అసెంబ్లీ సీటును కొత్త వ్య‌క్తికి ఇస్తోందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే ఆయా పార్టీలు క‌స‌రత్తు చేస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా అప్పుడే అభ్య‌ర్థులను ఎంపిక చేయ‌డంతోపాటు స‌ర్వేలు కూడా చేయిస్తున్నాయి.

ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్సార్సీపీ ముందంజ‌లో ఉంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. సీఎం జ‌గ‌న్ వ‌న్‌టైమ్ వండ‌ర్ మాత్ర‌మేన‌ని.. ఇక ఆయ‌న జ‌న్మ‌లో సీఎం కాలేడ‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ గెలిచి త‌మ స‌త్తా చాటాల‌ని వైఎస్సార్సీపీ ధృడ సంక‌ల్పంతో ఉంది. ఈ నేప‌థ్యంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం పేరిట ఆ పార్టీ ఇంటింటికీ తిరుగుతోంది.

కాగా క‌డ‌ప అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి ప్ర‌స్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషాకు సీటు ద‌క్క‌ద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం అంజాద్ బాషా ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్నారు. 2014, 2019 ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ అభ్య‌ర్థిగా ఆయ‌న భారీ మెజారిటీతో ఎన్నిక‌య్యారు. జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటుగానే ఉంటార‌ని అంటుంటారు. ఈ నేప‌థ్యంలోనే సీఎం జ‌గ‌న్ కేబినెట్లో డిప్యూటీ సీఎం కాగ‌లిగార‌ని చెబుతుంటారు.

అందులో రెండో విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో చాలామంది మంత్రుల‌కు జ‌గ‌న్ ఉద్వాస‌న ప‌లికి కొత్త‌వారిని ఎంచుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే అంజాద్ బాషాను మాత్రం త‌న రెండు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ల్లో డిప్యూటీ సీఎంగా జ‌గ‌న్ కొన‌సాగించ‌డం విశేషం.

అయితే క‌డ‌ప‌కే చెందిన టీడీపీ మాజీ మంత్రి ఖ‌లీల్ బాషా గ‌తంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయ‌న కుమారుడికి ఈసారి సీటు ఇవ్వాల‌ని జ‌గ‌న్‌కు అత్యంత ఆప్తుడైన ఒక ఎంపీ ఒత్తిడి తెస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ మేర‌కు ఖ‌లీల్ బాషా కుమారుడు విదేశాల్లో ఉండ‌గా.. ఆయ‌న‌ను హుటాహుటిన క‌డ‌ప‌కు పిలిపించి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేలా ఆ ఎంపీ చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రోవైపు ఖ‌లీల్ బాషా కూడా పార్టీలో చేరిన‌ప్పుడు త‌న భ‌విష్య‌త్ చూసుకుంటాన‌ని హామీ ఇచ్చార‌ని.. త‌న కుమారుడికి సీటు ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్‌ను కోరుతున్న‌ట్టు తెలుస్తోంది.

అయితే ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ కిశోర్ బృందంతోపాటు మ‌రో మూడు సంస్థ‌లో సీఎం జ‌గ‌న్ క‌డ‌ప అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో స‌ర్వే చేయిస్తున్నార‌ని చెబుతున్నారు. మొత్తం న‌లుగురు ముస్లిం అభ్య‌ర్థుల‌పైన స‌ర్వే చేయిస్తున్నార‌ని అంటున్నారు. ఈ న‌లుగురిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు ఖ‌లీల్ బాషా కుమారుడు కూడా ఉన్నార‌ని పేర్కొంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు స‌ర్వేలో అంజాద్ బాషాకే ప్ర‌జ‌ల మొగ్గు ఉంద‌ని స‌మాచారం. అయితే పూర్తి స్థాయి స‌ర్వే వ‌చ్చాక అభ్య‌ర్థి ఎంపికపై నిర్ణ‌యం తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో జ‌గ‌న్ ఉన్నార‌ని అంటున్నారు.