Begin typing your search above and press return to search.

ఏపీఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ చుక్కలు!

By:  Tupaki Desk   |   4 Jun 2022 7:32 AM GMT
ఏపీఆర్టీసీ ఉద్యోగులకు జగన్ సర్కార్ చుక్కలు!
X
పే రివిజన్ స్కేల్ (పీఆర్సీ) విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏపీఆర్టీసీ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విధాలా ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను బుట్టదాఖలు చేసి తమకు అన్యాయం చేసిందని ధ్వజమెత్తుతున్నాయి.

చంద్రబాబు ప్రభుత్వం తమకు 25 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే అందులో 2 శాతం కోసేసి 23 శాతానికి తగ్గించిందని ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు 4.7 శాతం రావాల్సి ఉండగా.. ప్రభుత్వం తనదైన లెక్కలు చూపి 3.1 శాతంతోనే సర్దుకోమని చెప్పేసిందని అంటున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ జరిపితే ఆర్టీసీ సిబ్బంది కోల్పోయే 15 నెలల ఫిట్‌మెంట్‌ వ్యత్యాసాన్ని 1.6 శాతం ప్రొరేటాతో భర్తీ చేయాలన్న అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను గాలికి వదిలేసిందని చెబుతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఆర్టీసీ ఉద్యోగులు 2020 జనవరి నుంచి పీడీటీ ఉద్యోగులుగా ఆర్టీసీలో విలీనమయ్యారు. వీరికి ఆర్టీసీలో ఉన్నప్పుడు 2017 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణను అమలు చేశారు. దీంతో 2017 ఏప్రిల్ నుంచి 2018 జూలై మధ్య 4.7 శాతం డీఏను మూల వేతనంలో కలపాలని అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరిలో 23 శాతం పీఆర్సీ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలలు ఆలస్యంగా 50 వేల మంది ప్రజా రవాణా శాఖ (పీటీడీ) సిబ్బందికి నూతన వేతన సవరణ అమల్లోకి తెచ్చింది. శుక్రవారం దీనిపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవోలో.. ప్రభుత్వ ఉద్యోగుల స్కేల్‌ను ఆర్టీసీ సిబ్బంది మాస్టర్‌ స్కేల్‌తో పోల్చి 32 గ్రేడ్‌లు, 83 స్టేజీలుగా ప్రభుత్వం చూపింది. ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జూలై నాటికి ఇచ్చిన 23 శాతం ఫిట్‌మెంట్‌తో ఆర్టీసీ సిబ్బందికి 2017 ఏప్రిల్‌ నాటికి సమం చేసింది. పదిహేను నెలల వ్యత్యాసానికి 1.6 శాతం ప్రొరేటా ఇవ్వాలన్న అశుతోశ్‌ మిశ్రా కమిటీ సిఫారసును ఏమాత్రం పట్టించుకోలేదు.

అదేవిధంగా ఆర్టీసీలో క్లర్క్‌ నుంచి అధికారి వరకూ అమల్లో ఉన్న గ్రేడ్‌ పేను ప్రభుత్వం రద్దు చేసింది. దాన్ని 2022 టైమ్‌ స్కేల్‌తో సరిచేసింది. ప్రభుత్వంలో విలీనమైతే పాత పెన్షన్‌ వస్తుందని ఆశపడ్డ ఆర్టీసీ సిబ్బందికి ఈపీఎస్‌ లేదా సీపీఎ్‌సలలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చని ఆప్షన్‌ ఇచ్చింది. అది కూడా ఆర్టీసీ ఫార్ములా ప్రకారమే గ్రాట్యుటీ పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది.

కాగా సర్వీస్‌ బెనిఫిట్స్‌, మెడికల్‌ అలవెన్స్‌, వీఆర్‌ఎస్‌ బెనిఫిట్స్‌, రిటైర్డ్‌ అయ్యాక లీవుల విక్రయం అన్నీ ప్రభుత్వ ఉద్యోగితో సమానంగా పొందవచ్చని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. రెండు ఇంక్రిమెంట్లతో కలిపి కింది స్థాయి సిబ్బందికి రూ.1500 నుంచి రూ.6000 వరకు తగ్గిందని సిబ్బంది చెబుతున్నారు. డిపో మేనేజర్‌ ఆ పైస్థాయి ఉద్యోగులకు ఏకంగా రూ.30వేల వరకూ కోత పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక సీనియర్‌ స్కేల్‌ ఆఫీసర్‌ నుంచి పై స్థాయిలో ట్రావెలింగ్‌ అలవెన్స్‌ రాష్ట్రంలో రూ.600, రాష్ట్రం దాటితే రూ.800 ఇవ్వనుంది. సూపరింటెండెంట్‌ నుంచి డిపో మేనేజర్‌ వరకూ రాష్ట్రంలో రూ.400, రాష్ట్రం దాటితే రూ.600.. అలాగే శ్రామిక్‌ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్‌ వరకూ రాష్ట్రంలో రూ.300, రాష్ట్రం దాటితే రూ.400 ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వివరించింది.

యూనిఫామ్‌ అలవెన్సులను మాత్రం యథాతథంగా కొనసాగించింది. డే అవుట్‌ అలవెన్స్‌ 20 రూపాయలకు తగ్గించింది. నైట్‌ అలవెన్స్‌ 240 కి.మీ. దాటితే రూ.45 చేసింది. కండక్టర్లకు రోజుకు 25 రూపాయల అలవెన్స్‌ ను కొనసాగించింది. గ్యారేజీ సిబ్బందికి సైతం అలవెన్సుల్లో కోత పడింది. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఆర్టీసీ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమకు అన్నివిధాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.