Begin typing your search above and press return to search.

ఏంద‌య్యో యిసిత్రం..ఉద్యోగాలు అడుగుతుండారే !

By:  Tupaki Desk   |   28 July 2022 5:19 AM GMT
ఏంద‌య్యో యిసిత్రం..ఉద్యోగాలు అడుగుతుండారే !
X
ఇప్ప‌టిదాకా సంక్షేమ ప‌థ‌కాల‌కు సంబంధించి క్యాలెండ‌ర్ ను అమ‌లు చేస్తూ ఇచ్చిన మాట ప్ర‌కారం ప‌నిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్న‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం. కానీ ఇదే స‌మ‌యంలో ఉద్యోగాల ఊసు మాత్రం ఎత్త‌డం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే వ‌లంటీర్ల ను, గ్రామ స‌చివాల‌య సిబ్బందిని త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా రిక్రూట్మెంట్ చేసుకుందే కానీ త‌రువాత ఉద్యోగాలేవీ ఇవ్వ‌లేదు. కొత్త పీఆర్సీ ప్ర‌కారం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల వేతనాలు, వలంటీర్ల కోసం నెల‌కు రూ.768 కోట్లను ఆర్థిక శాఖ వెచ్చిస్తోంది. కొత్త పే స్కేల్ ప్రకారం ఈ మొత్తాలు విడుద‌ల చేసింద‌ని కూడా తెలుస్తోంది. ఈ లెక్కన చూసుకుంటే 9,216 కోట్ల రూపాయ‌లు ఒక ఏడాదికి వేత‌నాల కింద విడుద‌ల చేయ‌నుంద‌ని తెలుస్తోంది. కానీ ఆ మేరకు ఫ‌లితాలు వ‌స్తున్నాయా అంటే వ‌స్తున్నాయ‌నే చెప్పాలి.

అన్ని చోట్ల కాక‌పోయినా కొన్ని చోట్ల అయినా సిబ్బంది బాగానే ప‌నిచేస్తుంది. కొంత‌వ‌ర‌కూ నిరుద్యోగ స‌మ‌స్య అన్న‌ది తీరింది. ప్రొబేష‌న్ పీరియ‌డ్ ను కూడా గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు సంబంధించి క‌న్ఫం అయింది. ఇదంతా బాగానే ఉన్నా రెగ్యుల‌ర్ జాబ్ ల‌కు సంబంధించి మాత్రం ఇటీవ‌ల కాలంలో గ్రూప్ 4 మిన‌హా ఒక్క‌టంటే ఒక్క నోటిఫికేష‌న్ కూడా లేదు. నిర్వ‌హించిన గ్రూప్ ఒన్ కూడా కోర్టు వివాదాల న‌డుమే ఉండిపోయింది.

ఊగిస‌లాడుతోంది. ఇంత‌వ‌ర‌కూ డీఎస్సీకి సంబంధించి కూడా క్లారిఫికేష‌న్ లేదు. టెట్ కు మాత్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి నిరుద్యోగుల‌కు కాస్త ఊర‌ట ఇచ్చారు. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సంబంధించి రెండు ల‌క్ష‌ల నాలుగు వేల ఉద్యోగాల‌న్న‌వి భ‌ర్తీకి సిద్ధంగా ఉన్నా, సంబంధిత కార్యాల‌యాలు కూడా నోటిఫికేష‌న్లు లేక వెల‌వెల‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలో నిన్న‌టి వేళ నెల్లూరు తెలుగు యువత రోడ్డెక్కి నిర‌స‌న‌లు తెలిపింది. త‌క్ష‌ణ‌మే ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేసింది.

స్థానిక వీఆర్సీ కూడ‌లిలో మంత్రుల ముఖ చిత్రాలు ధ‌రించి, వినూత్న రీతిలో నిర‌స‌న‌లు తెలిపిన వైనం ప్ర‌ధాన మీడియాలో వార్త రూపంలో క‌నిపించింది. వారి గోడును వివిధ ఛానెళ్లు కూడా వినిపించాయి. అయినా ఇవేవీ ప‌ట్ట‌ని విధంగానే ప్ర‌భుత్వం ఉంటోంద‌న్న ఆరోప‌ణ‌లు బ‌లీయంగా ఉన్నాయి. వీలైనంత వ‌ర‌కూ కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ నియామ‌కాలు త‌గ్గాల‌ని ఓ వైపు ఉద్యోగ సంఘాలు సైతం ప‌ట్టుబ‌డుతున్నాయి.

రెగ్యులర్ ఉద్యోగుల ఖాళీల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు ఇవ్వాలే కానీ ఔట్ సోర్సింగుల పేరిట త‌క్కువ జీతాల‌కు కొత్త‌వారిని నియ‌మించి, వారిపై ప‌ని ఒత్తిడి పెంచ‌డం భావ్యం కాద‌ని., ఇవ‌న్నీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధం అని స‌రైన ఆర్థిక భ‌ద్ర‌త లేకుండా ఉద్యోగాల క‌ల్ప‌న అన్న‌ది చ‌ట్ట విరుద్థం అని కూడా అంటున్నాయి. ఈ నేప‌థ్యాన వైసీపీ స‌ర్కారు మాత్రం విభిన్న వాద‌నే వినిపిస్తోంది.

గ్రామ, వార్డు స‌చివాల‌యాల పేరిట తాము ల‌క్ష‌కు పైగా యువ‌కుల‌కు అవ‌కాశాలు ఇచ్చామ‌ని పాత పాటే వినిపిస్తున్నాయి. కానీ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీల భ‌ర్తీకి సంబంధించి ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో అన్న‌ది స్ప‌ష్టం చేయ‌డం లేదు. తాము అధికారంలోకి వ‌స్తే ఏటా డీఎస్సీ అంటూ ప్ర‌క‌ట‌న‌ల‌తో ఊదర‌గొట్టిన జ‌గ‌న్ త‌రువాత వాటి ఊసే మ‌రిచి పోయార‌న్న వాద‌న ఇప్పుడు విన‌వ‌స్తోంది.