Begin typing your search above and press return to search.

విశాఖకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం!

By:  Tupaki Desk   |   30 Dec 2022 6:00 AM GMT
విశాఖకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం!
X
మూడు రాజధానుల విషయంలో హైకోర్టులో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ముందుకే వెళ్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో పెట్టడానికి ఉవ్విళ్లూరుతోంది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డులు హైదరాబాద కేంద్రంగా పనిచేస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో గోదావరి బోర్డును తెలంగాణలో ఉంచాలని నిర్ణయించారు. ఇక కృష్ణా నది యాజమాన్య బోర్డును ఏపీ ఇష్టానికే వదిలేశారు.

ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని జగన్‌ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ మేరకు అధికారుల బృందం పలు భవనాలను విశాఖపట్నంలో పరిశీలించింది. అప్పట్లో మూడు రోజులపాటు విశాఖలో మకాం వేసిన అధికారుల బృందం కేంద్ర జలవనరుల శాఖకు సైతం నివేదిక అందించింది.

2019లో జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. కృష్ణా నది బోర్డును విశాఖకు తరలిస్తే ఉచిత కార్యాలయ వసతి కల్పిస్తామని తెలిపింది. ఈ క్రమంలో జనవరి 11న జరగనున్న సమావేశంలో బోర్డు తరలింపు కూడా ప్రధాన అజెండాగా మారింది.

ఈ నేపథ్యంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి తరలిపోనుంది. జనవరి 11న జరిగే బోర్డు సమావేశంలో కార్యాలయ తరలింపును అజెండాగా చేర్చడం ఇందుకు ఊతమిస్తోంది. బోర్డు తరలింపునకు గత సమావేశంలో తెలంగాణ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో అడ్డంకులు తొలగినట్టే.

ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వం నిర్ణయం మరోసారి విమర్శలకు కారణమవుతుందని చెబుతున్నారు. వాస్తవానికి కృష్ణా నది ఆంధ్రప్రదేశ్‌ లో ఉమ్మడి కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో మాత్రమే ప్రవహిస్తోంది. ఒకవేళ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలనుకుంటే కర్నూలు, గుంటూరు, విజయవాడల్లో ఎక్కడైనా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. లేదా ఈ మూడు జిల్లాల్లో ఎక్కడో చోట పెట్టొచ్చు.

అలా కాకుండా కృష్ణా నది ప్రవహించని విశాఖపట్నంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించడం విమర్శలకు కారణమవుతోంది. మరోవైపు తమ అనుమతులు లేకుండా ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని విశాఖపట్నం తరలించవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు కార్యాలయం మార్పు న్యాయపరంగానూ వివాదం సృష్టించే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.