Begin typing your search above and press return to search.

రైతులు పాదయాత్ర అంటే రిపేర్లు గుర్తుకు వస్తాయి.. ఆగిన తర్వాతేమైంది?

By:  Tupaki Desk   |   7 Nov 2022 7:30 AM GMT
రైతులు పాదయాత్ర అంటే రిపేర్లు గుర్తుకు వస్తాయి.. ఆగిన తర్వాతేమైంది?
X
చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతనలేకుండా వ్యవహరించే విషయంలో జగన్ సర్కారు ముందు ఉంటుందన్న విమర్శ తరచూ వినిపిస్తుంటుంది.ఏం చేసినా తాము మాత్రమే చేయాలే తప్పించి.. ఇంకెవరూ ఏమీ చేయకూడదన్నట్లుగా వారి తీరు ఉంటుందన్న ఆరోపణ ఉంది. అందుకు తగ్గట్లే వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో శ్రీకాకుళం వరకు చేపట్టిన అమరావతి రైతుల పాదయాత్ర మధ్యలో ఆగటం తెలిసిందే. వాస్తవానికి అమరావతి రైతుల పాదయాత్ర రాజమహేంద్రవరం వద్దకు చేరుకోవటానికి ముందు.. వంతెన మీద రాకపోకల్ని ఆపేయటం తెలిసిందే.

అదేమిటంటే.. రిపేర్లు చేయాల్సిన అవసరం ఉందని.. వంతెన వాడటానికి వీల్లేని రీతిలో ఉందన్న మాట ప్రభుత్వం చెప్పింది. అయితే.. తమ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే రాజమహేంద్రవరం - కొవ్వూరు వంతెనను నిలిపివేశారని.. అయినా తాము వెనక్కి తగ్గమని.. వేరే రహదారిలో వెళతామని.. తమకు కొంత కష్టమైనా ముందుకు వెళ్లటమే లక్ష్యంగా పాదయాత్ర ఉంటుందని చెప్పటం తెలిసిందే. తాము ఎన్ని సవాళ్లు విసిరినా వాటిని అధిగమిస్తూ పాదయాత్రను చేస్తున్నవారికి.. గుర్తింపు తనిఖీ పేరుతో మోకాలు అడ్డటం.. తాత్కాలికంగా పాదయాత్ర ఆగటం తెలిసిందే.

ఈ విషయాన్ని ఇక్కడ వదిలేస్తే.. పాదయాత్రకు కాస్త ముందు రాజమహేంద్రవరంలోని బ్రిడ్జిని రిపేర్ల కోసం రాకపోకలు ఆపేస్తున్నట్లు చెప్పారు కదా? మరి.. ఇన్ని రోజులకు రిపేర్ పనులు ఎంతవరకు వచ్చాయి? అన్నది చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే.

రైల్వే.. రోడ్లు భవనాల శాఖ సంయుక్తంగా అత్యవసర రిపేర్లు చేయనున్నట్ులగా చెప్పి వంతెన మీద రాకపోకల్ని నిలివి వేశారు. ఆ సందర్భంగా వారం రోజుల్లో పనులు పూర్తి అవుతాయిన చెప్పారు. అయితే.. చెప్పిన మాటలకు భిన్నంగా 13 రోజుల తర్వాత రాకపోకల్ని ఆపేశారు. మళ్లీ గత నెల 27 నుంచి పునరుద్ధరించారు.

మరి.. ఇన్నిరోజులు రాకపోకలు ఆపేసి.. రిపేర్లు చేసిన వేళలో.. వంతెన మీద చేసిన మార్పుల గురించి చూస్తే.. నోట మాట రాని పరిస్రథితి. సాధారణ పనులు తప్పించి.. అత్యవసర కార్యాచరణ ఏమీ జరగలేదు. చిన్న చిన్న పనుల్ని కూడా పూర్తి చేయలేదు. చాలాచోట్ల రెయిలింగ్ శిథిలావస్థకు చేరినా.. పలుచోట్ల ధ్వంసమైనా వాటిని రిపేర్లు చేయలేదు. మరి.. ఇవన్నీ చేయకుండా రిపేర్ల కోసమని యుద్ధ ప్రాతిపదికన ఆపేసి.. ఆ తర్వాత ఏమీ చేయకుండా ఎందుకు ఉన్నట్లు? అన్నది అసలు ప్రశ్న.

తమ రాజకీయ అవసరానికి రిపేర్లు గుర్తుకు రావటం.. పాదయాత్ర ఇప్పట్లో మొదలు కాదన్న క్లారిటీ వచ్చినప్పుడు.. రిపేర్లు అన్న మాటను పక్కన పెట్టేసి.. మళ్లీ రాకపోకలకు అనుమతించిన వైనం చూస్తే.. అడ్డగోలు వాదనకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచేవారు ఈ ఉదంతాన్ని మరెలా సమర్థించుకుంటారో అన్న ఆలోచన కలుగక మానదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.