Begin typing your search above and press return to search.

అనంత వైసీపీలో మైన‌స్‌లు ఇవేనా?

By:  Tupaki Desk   |   31 Dec 2021 3:59 AM GMT
అనంత వైసీపీలో మైన‌స్‌లు ఇవేనా?
X
అది.. టీడీపీకి బ‌ల‌మైన కంచుకోట వంటి జిల్లా. అయితే.. 2019 ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హా.. అన్నింటిలోనూ వైసీపీ పాగా వేసింది. రెండు ఎంపీస్థానాల‌నుకూడా కైవ‌సం చేసుకుంది. అయితే.. ఈ జోష్ వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఆ జిల్లానే అనంత‌పురం. ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. వైసీపీ పాల‌న ప్రారంభించిన రెండున్న‌రేళ్ల‌లో ఇక్క‌డి ప్ర‌జ‌ల నాడిని వైసీపీ నాయ‌కులు ప‌సిగ‌ట్ట‌లేక పోయారు.

అందుకే.. తాడిప‌త్రి వంటి కీల‌క‌మైన మునిసిపాలిటీని వైసీపీ వ‌దులుకుంది. మ‌రి .. ఈ జిల్లాలో ఏం జ‌రిగింది. ఎందుకు వైసీపీ జోష్ పై సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది. అనంత‌పు రం జిల్లా అంటేనే వివాదాలు.. నేత‌ల మ‌ధ్య విభేదాలు.. రాజ‌కీయ పార్టీల దూకుడు ఎక్కువ‌గా ఉండే జిల్లా. పైగా క‌రువు ప్రాంతం. ఎమ్మెల్యేలు చేయాలంటే..చేతినిండా ప‌ని ఉంటుంది. వ‌ద్దునుకుంటే.. వివాదాలు కూడా మెండుగానే ఉన్నాయి. రెండోది .. కొన్ని ద‌శాబ్దాలుగా జ‌రుగుతూనే ఉంది.

అందుకే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. అయితే.. ఇప్పుడు.. వైసీపీలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఎమ్మెల్యేల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. ఎంపీల‌కు.. ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య క‌లివిడి లేదు. దీంతో ఎవ‌రు ఏం చేస్తున్నార‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు క్లారిటీ లేకుండా పోయింది. ఇక‌, మంత్రి శంక‌ర‌నారాయ‌ణ‌పైనే నియోజ‌క‌వ‌ర్గంలోనూ.. జిల్లాలోనూ వ్య‌తిరేక‌త ఇంతింతై.. అన్న‌ట్టుగా మందుకు సాగుతోంది. ఈ ప‌ద‌వి ఉండేనో..ఊడేనో.. అన్న‌ట్టుగా.. ఉన్న ఆయ‌న‌.. త‌న‌పై వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోక‌పోవ‌డంతో.. ఇది పార్టీకి మైన‌స్‌గా మారిపోయింది.

మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు.. పొరుగు రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవ‌డంలో బిజీగా గ‌డుపుతున్నారు. మ‌రికొంద‌రు అస‌లు తాము.. ప్ర‌జ‌ల్లో ఉండ‌డమే ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఒక‌రిద్ద‌రు ..ప్ర‌త్య‌ర్తుల‌పై క‌క్ష సాధించేందుకే.. ప్ర‌జ‌లు త‌మ‌ను గెలిపించార‌నే భావ‌న‌లో ఉన్నారు. ఇక‌, ఎంపీలు కూడా త‌మ దూకుడు చూపించ‌డంతో వైసీపీ ప‌రిస్థితి.. పుంజుకున్నట్టు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏం జ‌రుగుతుందో చూడాలి.