Begin typing your search above and press return to search.

ఎదురే లేని ఉప పోరులోనూ వైసీపీ కక్కుర్తి పడిందా?

By:  Tupaki Desk   |   31 Oct 2021 7:12 AM GMT
ఎదురే లేని ఉప పోరులోనూ వైసీపీ కక్కుర్తి పడిందా?
X
ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేదు. కాస్తోకూస్తో ప్రజాదరణ ఉన్న పార్టీ కూడా బరిలో లేదు. మిగిలింది.. సరైన క్యాడర్ కూడా లేని ఒక పార్టీ పోటీలో ఉన్న వేళ.. తిరుగులేని శక్తివంతమైన అధికార పార్టీ ఎంత నిమ్మళంగా ఉండాలి. మరెంత ధీమాగా ఉప ఎన్నికను పూర్తి చేయాలి? కానీ.. అలాంటివేమీ కనిపించని రీతిలో బద్వేల్ ఉప ఎన్నిక సాగటం షాకింగ్ గా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన బద్వేల్ లో వైఎస్ కుటుంబానికి ఉన్న బలం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు ప్రభుత్వంపై ఎలాంటి వ్యతిరేకత లేదన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళలో.. ఉప పోరులో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు కొత్త చర్చకు కారణమైంది.

టీడీపీ.. జనసేనలు పోటీలో లేనప్పుడు.. పోటీలో ఉన్న ఏకైక పెద్ద పార్టీ బీజేపీనే. ఆ మాటకు వస్తే.. కడప జిల్లాలో బీజేపీకి కార్యకర్తల అండే లేదు. ఇలాంటప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీకి తిరుగు ఉండదు. అయినప్పటికీ వేరే ప్రాంతాలకు చెందిన వారిని తీసుకొచ్చి ఓట్లు వేయించిన తీరు విమర్శలకు తావిస్తోంది. పోలింగ్ కేంద్రాల్ని ఆక్రమించుకున్నారని.. భారీగా రిగ్గింగునకు పాల్పడ్డారని చెబుతున్నారు.

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సతీమణికే టికెట్ కేటాయించారు. ఆమెకు పోటీగా బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి స్థానికేతరుడు కావటం.. పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి లెక్కలోకి తీసుకోవాల్సిన పరిస్థితి లేకపోవటం తెలిసిందే. ఇలాంటి సమయంలో జరిగిన ఎన్నికపై ఎవరికి ఎలాంటి ఆసక్తి లేదు. ఎందుకంటే.. వైసీపీ గెలుపు లాంఛనం మాత్రమే. ఇలాంటి సమయాల్లో విమర్శలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సింది.

అందుకు భిన్నంగా కడపలోని సిద్దవటం.. కడప.. సీకే దిన్నే.. ప్రొద్దుటూరు మండలాలకు చెందిన స్థానికేతరులు ముందుగానే అట్లూరు.. బద్వేలు టౌన్.. పోరుమామిళ్ల మండలాలకు చేరుకోవటం హాట్ టాపిక్ గా మారింది. పలువురు తిరుపతి ఉప ఎన్నికను గుర్తు చేసుకున్నారు. కొన్నిచోట్ల బీజేపీ పోలింగ్ ఏజెంట్లు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. పోరుమామిళ్లలోని 52, 56, 58 పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రొద్దుటూరు.. జమ్మలమడుగు నుంచి వచ్చిన నాన్ లోకల్స్ ను కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మ భర్త ప్రభాకర్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అప్రమత్తమై చర్యలు తీసుకునే లోపు.. వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కూర్చొని గెలిచే ఉప పోరులో స్థానిక నేతల అత్యుత్సాహం.. అధికార వైసీపీపై విమర్శలు సంధించే అవకాశాన్ని ఇచ్చిందని చెబుతున్నారు.