Begin typing your search above and press return to search.

అక్కడ ఫ్యాన్ స్పీడ్ తగ్గుతోందా... ?

By:  Tupaki Desk   |   10 Jan 2022 1:30 AM GMT
అక్కడ ఫ్యాన్ స్పీడ్ తగ్గుతోందా... ?
X
విశాఖ జిల్లాలో అతి కీలకమైన నియోజకవర్గాల్లో భీమునిపట్నం ఒకటి. ఈ సీటు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చెప్పాలి. ఆ పార్టీ ఆవిర్భావంతో భీమిలీలో జెండా ఎగరేసింది. టీడీపీ పుట్టాక ఇప్పటికి పదిసార్లు ఎన్నికలు జరిగితే అందులో ఏడు సార్లు సైకిల్ పార్టీయే భారీ మెజారిటీతో జయకేతనం ఎగరేసింది అంటే అక్కడ టీడీపీ పవర్ ఏంటో ఊహించాల్సిందే. ఇక భీమిలీలో టీడీపీ కాకుండా ఒకసారి కాంగ్రెస్, మరోసారి ప్రజారాజ్యం, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాయి.

క్షత్రియులకు కోటగా ఉన్న భీమిలీ నుంచి ఫస్ట్ టైమ్ కాపు సామాజికవర్గం ఈ సీటును 2004 ఎన్నికల్లో లాగేసింది. ఇప్పటికి నాలుగు విడతలుగా కాపులే ఇక్కడ విజేతలుగా నిలుస్తున్నారు. పార్టీలు వేరైనా వారిదే హవా. 2004లో కాంగ్రెస్ తరఫున కర్రి సీతారామ్ గెలిచి ఆ సామాజికవర్గం సత్తా చాటారు. ఇక 2009 నాటికి ప్రజారాజ్యం నుంచి బరిలోకి దిగిన అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యే అయిపోయారు. 2014లో టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు గెలిచి మంత్రి అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ గెలిచి మంత్రి పదవి చేపట్టారు.

ఇపుడు చూసుకుంటే అవంతి శ్రీనివాస్ గ్రాఫ్ మెల్లగా తగ్గుతోంది అని అంటున్నారు. అదే టైమ్ లో టీడీపీ బాగా పుంజుకుంది. ఇక జనసేన కూడా గట్టిగానే ఉంది. 2019 ఎన్నికల్లో జనసేనకు పాతిక వేల ఓట్లు వచ్చాయి. అప్పట్లో టీడీపీఎ మీద కేవలం తొమ్మిది వేల ఓట్ల తేడాతోనే అవంతి విజయం సాధించారు. చివరి నిముషంలో టీడీపీ అభ్యర్ధిని ప్రకటించినా కూడా మాజీ ఎంపీ సబ్బం హరి గట్టి పోటీ ఇచ్చారు. నాడు జనసేన ఓట్లు చీల్చకపోయి ఉంటే మరోమారు టీడీపీయే అక్కడ గెలిచేది అని ఓట్ల లెక్కలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అంటున్నారు మాజీ ఎంపీపీ, టీడీపీ ఇంచార్జి అయిన కోరాడ రాజబాబు. ఆయన చాప కింద నీరులా తన బలం పెంచుకుంటూ ముందుకు పోతున్నారు. పార్టీలో పోటీకి ఇతర పేర్లున్నా పక్కా లోకల్ కార్డుతో రాజబాబు టికెట్ తనకే అన్న ధీమాతో ఉన్నారు. ఇక జనసేన తరఫున పంచకర్ల సందీప్ కూడా చురుకుగా ఉన్నారు. పొత్తులో భాగంగా ఈ సీటుని కోరితే ఆయనే అభ్యర్ధి అంటున్నారు.

ఇంకో వైపు నుంచి చూసుకుంటే గంటా శ్రీనివాసరావు కూడా ఇదే సీటు మీద కన్నేశారు అంటున్నారు. ఆయనకు భీమిలీలో సొంతంగా మంచి బలం, బలగం ఉంది. దాంతో ఆయన చివరి నిముషంలో టికెట్ రేసులో ఏ పార్టీ నుంచి అయినా సాధించగలరని ఆశావహులలో భయం ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి అవంతి ఎమ్మెల్యేగా గెలవడం అంత ఈజీ కానే కాదు అంటున్నారు. ఆయన మీద వ్యక్తిగతంగా వ్యతిరేకత ఉంది. పార్టీఎ మీద కూడా జనాలలో అభిప్రయాం మెల్లగా మారుతోంది. మొత్తానికి చూస్తే వైసీపీ ఫ్యాన్ ఇక్కడ సరిగ్గా తిరగడంలేదు అనే చెప్పాల్సి ఉంటుంది. మరి ఎన్నికల ముందర ఏమైనా పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప అవంతి కి గడ్డు కాలమే అంటున్నారు.