Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదాను కెలుక్కుని ఇరుకున పడ్డ వైసీపీ...?

By:  Tupaki Desk   |   15 Feb 2022 5:42 AM GMT
ప్రత్యేక హోదాను కెలుక్కుని ఇరుకున పడ్డ వైసీపీ...?
X
నిజానికి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదాను కేంద్రం ఏమీ ఇవ్వలేదు, ఇవ్వదేమో కూడా. ఏదో జస్ట్ కేంద్ర హోం శాఖ త్రి సభ్య కమిటీలో దానిని టేబిల్ ఐటెమ్ గా పెట్టారు. అది కూడా అక్కడ ఎవరో పొరపాటుగా చూడకుండా పెట్టారు అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చెప్పారు కూడా. సరే టేబిల్ ఐటెమ్ గా దాన్ని పెట్టినపుడు కిమ్మనకుండా వైసీపీ నేతలు ఉంటే ఈ నెల 17న నాటికి అది ఏదో ఒకలా చర్చకు వచ్చేదేమో.

అలా కాకుండా ఇలా కేంద్ర హోం శాఖ నుంచి ఏపీ సీఎస్ కి లేఖ వచ్చిందో లేదో వైసీపీ అనుకూల చానళ్లలో అలా పెద్ద ఎత్తున హడావుడి స్టార్ట్ అయిపోయింది. అది కూడా ఒక్కలా లేదు వీర లెవెల్ లో హోదా వచ్చేసినట్లే అని ప్రచారాన్ని చేసుకొచ్చారు. మరో వైపు హోదాను తెచ్చిన మొనగాడుగా చెబుతూ జగన్ని ఇంద్రుడు చంద్రుడు చేసేశారు. ఏపీకి హోదా సాధించేశామనే చెప్పుకున్నారు. అలా ఏపీ జనాలలో కొత్త ఆశలు కల్పించింది నిఖార్సుగా చెప్పాలంటే వైసీపీ నేతలే. అలా ఉదయం నుంచి సాయంత్రం వరకూ అంతా కలసి బాకా ఊదాక కేంద్ర హోం శాఖ హోదా ఐటెమ్ ని వెనక్కి తీసేసుకుంది.

ఇక అపుడు ఏం చేయాలో తెలియక వైసీపీ నేతలు టీడీపీ మీద ఆ బురదను జల్లేశారు. చంద్రబాబు చెప్పిన మీదట బీజేపీలోకి వెళ్ళిన టీడీపీ ఎంపీలు కేంద్రంతో వత్తిడి చేసి మరీ హోదా అంశాన్ని తీయించేశారట. వినడానికే ఇది చాలా వింతగా ఉంది. నిజానికి కేంద్రం వద్ద టీడీపీకి అంత పలుకుబడి ఇపుడు ఉందా అన్నదే కదా ప్రశ్న.

చంద్రబాబు తన బాధలేవో తాను పడుతూంటే ఆయన ప్రత్యేక హోదాను కాదన్నారని, ఏపీకి రానీయని తీరున కుట్రలు చేశారని మరింతగా బదనాం చేసేందుకు వైసీపీ నేతలు తెగబడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వారు అయితే హోదా ద్రోహులు టీడీపీ నేతలు అని కూడా ముద్ర వేశారు. ఇక ఆ మీదట టీడీపీ ఊరుకుంటుందా. సరే హోదా మీద ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందామని సవాల్ చేస్తోంది.

చంద్రబాబు అయితే సూటిగానే జగన్ని నిలదీశారు. ఆనాడు రాజీనామాలు అంతా కలసి చేస్తే హోదా వస్తుంది అన్నారు కదా. ఇపుడు ఆ పని చేసి చూపించు జగన్ అని గట్టిగానే రిటార్ట్ ఇచ్చారు. దాంతో పూర్తిగా ఇరుకున పడడం వైసీపీ వంతు అయింది. ఇపుడు అటూ ఇటూ తిరిగి అంతా వైసీపీనే కార్నర్ చేస్తున్నారు అవును వైసీపీ అధికారంలో ఉంది. రెండు సభల్లో కలుపుకుని ఏకంగా 28 మంది ఎంపీలు ఉన్నారు.

కేంద్రం మీద పోరాడాలీ అంటే కచ్చితంగా తమ సత్తా చూపడానికి రాజీనామా చేయాలి. అపుడు వైసీపీ మీద జనాలకు కూడా నమ్మకం కలుగుతుంది, కేంద్రానికి కూడా గట్టిగా చెప్పినట్లు అవుతుంది. అవన్నీ మానేసి టీడీపీ హోదాను రాకుండా చేస్తోంది, బీజేపీలోని ఒకరిద్దరు ఎంపీలు ఇలా చేశారు అని లేని పోని కబుర్లు చెబితే జనాలు నమ్ముతారా.

మొత్తానికి చూస్తూంటే ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ అనవసరంగా కెలుక్కుని ఇపుడు బిగ్ ట్రబుల్స్ లో పడినట్లు అయింది. రానున్న రోజుల్లో ఇది ఇంకా పెద్దది అవుతుంది. ఏ రోజుకి అయినా ప్రజలు చూసేది అధికార పార్టీల వైపే. అంతే తప్ప ట్విస్టులు చేసి అటూ ఇటూ తిప్పేసి టీడీపీ మీద కానే మరో పార్టీ మీద కానీ నిందలేస్తే జనాలు నమ్మరు కాక నమ్మరు. మరి వైసీపీ నేతలు ఏమి చేస్తారో.