Begin typing your search above and press return to search.

వైసీపీ వాళ్లను చేర్చుకుంటే నాడు 23 సీట్లు వచ్చాయి..ఇప్పుడు వైసీపీలో అదే రివర్సా?

By:  Tupaki Desk   |   30 Sep 2020 4:30 PM GMT
వైసీపీ వాళ్లను చేర్చుకుంటే నాడు 23 సీట్లు వచ్చాయి..ఇప్పుడు వైసీపీలో అదే రివర్సా?
X
‘నీ ముక్కు ఎక్కడుంది?’ అంటే స్ట్రెయిట్ గా చూపించారు టీడీపీ వాళ్లు. అదే ప్రశ్న వైసీపీ వాళ్లను అడిగితే తల చుట్టూ చేతిని తిప్పి ఇదిగో ఇక్కడుందని చూపించారు. ఇద్దరూ చూపించింది ముక్కునే. కానీ సాగదీసి డౌట్ రాకుండా చేస్తున్నారు వైసీపీ వాళ్లు. ఇప్పుడు ఇదే వైసీపీ క్షేత్రస్థాయి నేతల్లో కోపానికి కారణమవుతోందట.. టీడీపీ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలను యథేచ్ఛగా డైరెక్టుగా చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ అధిష్టానం మాత్రం టీడీపీ ఎమ్మెల్యేల కుటుంబాలను చేర్చుకుంటున్నారట. రెంటికి పెద్ద తేడా లేదంటున్నారు కింది స్థాయి నేతలు.

2014 ఎన్నికల్లో జగన్ కు 67 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చేతిలో వైసీపీ ఓడిపోయింది. దీంతో ఇదే అదునుగా జగన్ పార్టీని లేకుండా చేయాలని రాజకీయంగా అంతగా అనుభవం లేని లోకేష్ ఏదో ఆలోచన చేసి 23మంది వైసీపీ వాళ్లను టీడీపీలో చేర్చుకున్నాడట.. అందులో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టించాడట.. కానీ కట్ చేస్తే.. జగన్ తర్వాత ఎన్నికల కోసం రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి ప్రజలంతా నమ్మి టీడీపీ మీద ఎదురు తిరిగి చేర్చుకున్న ఆ 23మందినే టీడీపీకి 2019 ఎన్నికల్లో మిగిల్చిన దుస్థితి కల్పించారు.

అయితే ఇప్పుడు వైసీపీ పాలనలోనూ పరిస్థితి అలానే ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అలాంటప్పుడు డైరెక్టుగా చేర్చుకోకున్నా ఎమ్మెల్యేల కొడుకులకు కండువాలు కప్పితే ప్రజలు అర్థం చేసుకోనంత అమాయకులు ఏం కాదు అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. ఏదో టెక్నికల్ గా మీడియా కోసం చెప్పుకోవచ్చు కానీ.. నైతికంగా మాట్లాడితే ఇలా ఎమ్మెల్యేలను చేర్చుకొని వైసీపీ వాళ్లకు అన్యాయం చేస్తే ఎలా అని పెద్ద ఎత్తున వైసీపీలో చర్చ జరుగుతోంది.

వాళ్లను చేర్చుకుంటే ఇప్పుడు వైసీపీ హైకమాండ్ కి ఏమైనా వస్తుందా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ప్రజలు 151మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఇచ్చారని.. ఇంకా నేతలను చేర్చుకోవడం అవసరం అని అడుగుతున్నారు. ఏదో టీడీపీని బలహీనపరుస్తున్నామనే ఆనందం తప్పితే మరేం లేదని ఈసడించుకుంటున్నారు.

ఆ రోజు చంద్రబాబు, లోకేష్ ఇలా చేస్తేనే ప్రజలు వాళ్లను ఛీకొట్టారు. కాబట్టి ప్రజలను ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా ఇన్ డైరెక్టుగా టీడీపీ నేతలను చేర్చుకోవద్దని.. ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి తిరుపతి ఉప ఎన్నికలతోపాటే ఆ జంపింగ్ ఎమ్మెల్యేల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే జగన్ మీద అపారమైన నమ్మకం ప్రజలకు కలుగుతుందని సూచిస్తున్నారు. అలా చేయకుండా ఇలానే ముందుకెళితే రివర్స్ అయ్యే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు.