Begin typing your search above and press return to search.

అంచనాలు నిజం.. జగన్ కు వేదవ్యాస్ గుడ్ బై

By:  Tupaki Desk   |   16 Oct 2016 5:40 AM GMT
అంచనాలు నిజం.. జగన్ కు వేదవ్యాస్ గుడ్ బై
X
కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న అంచనాలు నిజమని తేలిపోయాయి. కృష్ణా జిల్లాలో బలమైన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యనేత ఒకరు తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేశారు. దివంగత మహానేత వైఎస్ కు సన్నిహితుడిగా పేరున్న బూరగడ్డ వేదవ్యాస్ తాజాగా తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు.

గడిచిన కొద్దిరోజులుగా వేదవ్యాస్ పార్టీ మారనున్నారని.. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ద్వారా మంతనాలు జరుగుతున్నాయని.. ఈ ఎపిసోడ్లో వేదవ్యాస్ కుమారుడు కీ రోల్ ప్లే చేస్తున్న విషయం మీడియా ముందే చెప్పేసింది. కృష్ణా జిల్లాలోపార్టీకి కీలకమైన నేతల్లో ఒకరైన వేదవ్యాస్.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోతున్న విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేసేశారు. జిల్లాలో చురుగ్గా ఉండే వైఎస్సార్ కాంగ్రెస్ నేతల్లో ఒకరైన వేదవ్యాస్ పార్టీని వీడిపోవాలని డిసైడ్ కావటం జగన్ పార్టీకి బలమైన దెబ్బ తగిలినట్లుగా చెప్పకతప్పదు.

జగన్ తీరు నచ్చకపోవటం.. నేతలతో ఆయన వ్యవహరించే తీరుతో అసంతృప్తిగా ఉన్న వేదవ్యాస్.. పార్టీ మారాలన్న నిర్ణయానికి కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. తాజాగా పెడనలో పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు నిర్వహించిన అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. తాను జగన్ పార్టీ నుంచి బయటకు వస్తున్న విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. తామున్నపార్టీని వదిలిపెట్టి.. అధికారపార్టీలో చేరే సమయంలో అందరు నేతలు ఏమైతే చెప్పారో.. అలాంటి మాటల్నే వేదవ్యాస్ కూడా చెప్పటం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని.. ఏపీ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకునేందుకే తానుపార్టీ మారుతున్నట్లు ఆయన ప్రకటించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/