Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యేల కేబినెట్ ఆశ‌ల‌పై నీళ్లు..!

By:  Tupaki Desk   |   18 May 2021 5:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్యేల కేబినెట్ ఆశ‌ల‌పై నీళ్లు..!
X
యేడాదిన్న‌ర కాలంగా దేశంలో ఏ వ్య‌వ‌హారం ముందుకు సాగ‌డం లేదు. అంతా క‌రోనా భ‌యంతోనే కాలం వెళ్ల‌దీయాల్సి వ‌స్తోంది. క‌రోనా లేక‌పోయి ఉంటే దేశంలో ప‌లు రాష్ట్రాల్లో రాజ‌కీయం ఎంత హాట్ హాట్‌గా ఉండేదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఏపీ, తెలంగాణ‌లో క‌రోనా ఉంటేనే రాజ‌కీయం సెగ‌లు క‌క్కుతోంది. అదే క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ సెగ‌లు మూములుగా ఉండేవి కావ‌నే చెప్పాలి. తెలంగాణ‌లో ఈట‌ల ఎపిసోడ్‌తో పాటు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న గురించే పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇక ఏపీలో వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజుతో పాటు మ‌రో నాలుగు నెల‌ల్లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న చుట్టూనే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. వాస్త‌వంగా జ‌గ‌న్ కేబినెట్ ఏర్ప‌డిన‌ప్పుడే 90 శాతం మంత్రుల‌ను రెండున్న‌రేళ్ల‌లో త‌ప్పించి కొత్త మంత్రుల‌కు అవ‌కాశం ఇస్తాన‌ని చెప్పారు.

అయితే ఈ రెండున్న‌రేళ్ల‌లో మంత్రులు చేసింది.. సాధించింది ఏం లేదు. ఇంకా చెప్పాలంటే క‌రోనా దెబ్బ‌తో వారికి ఆ అవ‌కాశం కూడా రాలేదు. తొలి యేడాది అంతా మంత్రులు త‌మ వ్య‌వ‌హారాలు చ‌క్క పెట్టుకోవ‌డంతోనే పుణ్య కాలం గ‌డిచిపోయింది. ఇక రెండో యేడాదిలోకి ఎంట‌ర్ అవ్వ‌కుండానే క‌రోనా వ‌చ్చి ప‌డిపోయింది. అప్ప‌టి నుంచి లాక్‌డౌన్లు, పాల‌న ముందుకు సాగ‌క‌పోవ‌డం, అభివృద్ధి మాటే లేక‌పోవ‌డం, లోటు బ‌డ్జెట్‌లోకి వెళ్లిపోవ‌డం, అభివృద్ధి ప‌నుల‌కు నిధులు లేక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో మంత్రుల‌కు కూడా చిన్న చిన్న ప‌నులు కూడా జ‌ర‌గ‌లేదు.

ఇక క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతం అయ్యాక చాలా మంది మంత్రులు.. ఇంకా చెప్పాలంటే 90 శాతం మంత్రులు అస‌లు జ‌నాల్లోకి వెళ్ల‌డమే మానేశారు. ఇక క‌రోనాకు ముందు వ‌ర‌కు మంత్రి ప‌ద‌వి రేసులో ఉన్న సీనియ‌ర్లు, ఎమ్మెల్యేలు సోష‌ల్ మీడియాలో ఎక్క‌డిక‌క్క‌డ నానా హంగామా చేసేవారు. ఇప్పుడు చేయ‌డానికి కూడా ఏం లేకుండా పోయింది. ఎవ‌రికి వారు బిక్కు బిక్కు మంటూనే కాలం గ‌డపాల్సిన ప‌రిస్థితి. క‌రోనా తొలి వేవ్‌లో స్వ‌చ్ఛందంగా బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల మ‌ధ్య తిరిగిన ప్ర‌జా ప్ర‌తినిధులు సెకండ్ వేవ్ ప‌రిస్థితి తీవ్ర‌త నేప‌థ్యంలో బ‌య‌ట‌కు రావ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు.

చాలా త‌క్కువ మంది నేత‌లు మాత్ర‌మే ప్ర‌జ‌ల్లో ఉంటూ.. ప్ర‌జ‌ల కోసం ఏదో ఒక కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. ఇక నిన్న మొన్న‌టి వ‌ర‌కు మంత్రి వ‌ర్గ రేసులో స్థానిక ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు, వారి ప‌నితీరు, స‌మ‌ర్థ‌త వంటి అంశాల‌నే మంత్రి ప‌ద‌వికి అర్హ‌త‌లుగా పెట్టుకున్న జ‌గ‌న్ ఇప్పుడు ఎవ‌రైతే క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల్లో ఉన్నారో వారినే ప్రాతిప‌దిక‌గా తీసుకుంటారేమో ? చూడాలి. ఏదేమైనా క‌రోనా చాలా మంది మంత్రి ప‌ద‌వి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింద‌నే చెప్పాలి.