Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ఎవ‌రితో ఊరేగితే మాకెందుకు.. వైవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   15 Jan 2023 2:30 AM GMT
ప‌వ‌న్ ఎవ‌రితో ఊరేగితే మాకెందుకు.. వైవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వైసీపీ కీల‌క నాయ‌కుడు, టీటీడీ బోర్డు చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రితో ఊరేగితే మాకెందుకు? అని అన్నారు. ఒంటరిగా పోటీ చేసే శక్తి లేకే పొత్తుల కోసం ఆరాట పడుతున్నానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎవ‌రైనా పొత్తులు పెట్టుకుంటే.. దానికి కార‌ణాలు చెబుతారు. కానీ, ప‌వ‌న్ త‌న‌కు శ‌క్తి లేద‌ని.. అందుకే పొత్తులు పెట్టుకుంటున్నాన‌ని చెబుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు.

ప‌వ‌న్‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు లేర‌నే విష‌యాన్ని ఆయ‌నే ఒప్పుకొన్నార‌ని.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుతోనే పవన్ పొత్తుకడుతున్నారని అన్నారు. పవన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా, ఎవ‌రితో ఊరేగినా వైసీపీకి, వైసీపీ నాయ‌కుల‌కు, ముఖ్యంగా సీఎం జ‌గ‌న్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. సంక్షేమ పథకాలే జగన్‌ ను మళ్లీ సీఎంను చేస్తాయన్నారు.

జగన్‌ను మూడు ముక్కల సీఎం అనడం సరికాదని వైవీ అన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ది కోసమే ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారన్నారు. తిరుమలలో సామాన్య భక్తులకు అవసరమైన రూముల ధరలు పెంచలేదని, వీఐపీల రూముల ధరలు మాత్రమే పెరిగాయని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రూ.120 కోట్లు ఖర్చు చేసి రూములు రీ మోడలింగ్ చేశామని తెలిపారు.

సాధారణ గదులు రీ మోడలింగ్ చేసి ఆ మేరకు మాత్రమే రేట్లు పెంచామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం.. వాద‌న‌కు దిగ‌డం.. దురుసుగా మాట్లాడ‌డం.. రాయ‌డం.. మీడియాకు అల‌వాటైపోయింద‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఏ శ‌క్తీ ఆప‌లేద‌న్నారు. సంక్షేమం తీసుకున్న ప్ర‌జ‌ల‌కు మ‌న‌సాక్షి ఉంటుందని, దానికి అనుగుణంగానే ఓటు వేస్తార‌ని చెప్పారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.