Begin typing your search above and press return to search.

వైఎస్సార్సీపీ నాయకుడిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ

By:  Tupaki Desk   |   30 March 2020 7:50 AM GMT
వైఎస్సార్సీపీ నాయకుడిని చెప్పుతో చితక్కొట్టిన మహిళ
X
అధికారం ఉంది కదా మనం ఏం చేసినా చెల్లిపోతుందనే ధోరణి కొందరి నాయకుల్లో ఉంటుంది. కొంతవరకు అది కలిసొచ్చినా అన్ని సమయాల్లో కలిసి రాదు. కలిసి రాకపోతే కష్టాలు మామూలుగా ఉండవు. ప్రస్తుతం టీడీపీ నాయకులది అదే పరిస్థితి. అధికారం ఉన్న సమయంలో చేసిన అక్రమాలు - దౌర్జన్యాలు - అవినీతి బయటకు వస్తూ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఆ నాయకులు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వంలో ఉన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా సేమ్‌ టీడీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం అధికారం ఉంది కదా అని కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. తమకు అడ్డు చెప్పేవారు లేరని, తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అని పేర్కొంటూ రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఓ నాయకుడు చేసిన పనికి ఆయన అందరి ముందు మహిళ చేతిలో చెప్పు దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రశాంతంగా ఉండగా వీరి వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్‌ స్టేషన్‌ కు ఓ మహిళ వచ్చింది. తన ఫొటోలను అసభ్యంగా వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ నాయకుడు పెట్టాడని.. చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో ఆ వ్యక్తి కూడా పోలీస్‌స్టేషన్‌ కు వచ్చాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆమె అతడిపై దాడికి పాల్పడింది. ఏకంగా చెప్పు తీసుకుని చితక్కొట్టింది. పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆమె దాడి చేయడంతో ఇటు బాధితురాలి వర్గం - ఆ నాయకుడి వర్గం మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన పోలీసులు వారిని చెదరగొట్టారు. వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలియరాలేదు. ఆ నాయకుడు ఎవరు? ఎందుకు అలా చేశాడు? ఏం జరిగిందనే విషయాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకుడిపై చెప్పుతో మహిళ దాడికి పాల్పడిందనే వార్త మాత్రం ప్రకాశం జిల్లాలో హాట్‌ టాపిక్‌ మారింది. మరి దీనిపై పోలీసులు - అధికార పార్టీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.