Begin typing your search above and press return to search.

బాబుకు అదిరిపోయే స‌ల‌హా ఇచ్చిన బొత్సా

By:  Tupaki Desk   |   6 Jun 2018 6:39 PM GMT
బాబుకు అదిరిపోయే స‌ల‌హా ఇచ్చిన బొత్సా
X
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన వైసీపీ నుంచి ఊహించ‌ని ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. బాబు అంటే విరుచుకుప‌డే వైఎస్ ఆర్‌ సీపీ సీనియర్ నేత‌ - మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనూహ్య ప్ర‌తిపాద‌న పెట్టారు. బాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్న స‌మ‌యంలో బొత్స చేసిన ప్ర‌తిపాద‌న ఆస‌క్తిక‌రంగా మారింద‌ని ప‌లువురు అంటున్నారు. ఏయిర్‌ ఏషియా కుంభకోణం వెలుగులోకి రావ‌డం, అందులో సీఎం చంద్రబాబు పేరు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం క‌ల‌క‌లంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ కంపెనీ ప్రతినిధులు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరును ప్రస్తావించడం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో బొత్స సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతి పొందేందుకు ఏయిర్‌ ఏషియా అక్రమ మార్గంలో వెళ్లేందుకు చంద్రబాబును దళారీగా ఎంచుకున్నారన్నారు. 2014 నుంచి ఏయిర్‌ ఏషియా ప్రతినిధులు ఇందుకోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. శాండిల్య - టోనీ పెర్నాండేజ్‌ ల సంభాషణల అనంతరం 2016 మే 20న ఓ జీవోను కేంద్రం జీవోను విడుదల చేసిందన్నారు. ఐదేళ్ల కాల పరిమితి అక్కర్లేదు..రెండేళ్లు చాలు అన్నది వాస్తవమా? కాదా అని ప్రశ్నించారు. సింగపూర్‌లో ఉన్న హెచ్ ఎన్ ఆర్‌ ట్రెడింగ్‌ కంపెనీకి రూ.12 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేసింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఈ కంపెనీతో టీడీపీ పెద్దలకు సంబంధాలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించారు. హెచ్ ఎన్ ఆర్‌ కంపెనీకి చెందిన రాజేంద్ర దుబే సీఎం చంద్రబాబు సింగపూర్‌ వెళ్లినప్పుడు ఆయనతో పాటు ఉన్నారా? లేదా అని, వీటికి సమాధానం చెప్పాలని బొత్స‌ డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు ఏయిర్‌ ఏషియా కుంభకోణంలో తన నిజాయితీని నిరూపించుకోవాలని బొత్స‌ సవాల్ విసిరారు. చంద్రబాబు నిప్పు అని చెప్పుకుంటుంటారని, ఆయన పార్టీకి చెందిన ఎంపీ అశోక్‌ గజపతిరాజు నీతిమంతుడని ప్రచారం చేసుకుంటారని, అయితే ఏయిర్‌ ఏషియా కుంభకోణంలో నిప్పు..నిజాయితీ ఏమయ్యాయని ప్రశ్నించారు. అశోక్‌ గజపతి రాజు తనతో చెప్పారని - చంద్రబాబు దేశానికి ప్రధాని స్థాయి ఉన్న వ్యక్తి అన్నారు. అశోక్‌గజపతి రాజు నాకు చాలా పరిచయం - ఆయన్ను ప్రసన్నం చేసుకోండి ఏమి కావాలో చంద్రబాబు చేస్తారన్న సంభాషణలు విన్నామన్నారు. దేశాన్ని దోచుకుతినేందుకు చంద్రబాబు స్కేచ్‌ వేశారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రాన్ని ఇప్పటికే కొల్లగొట్టిన చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ దేశాన్ని దోచే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజును అడ్డుపెట్టుకొని చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్నారు. ఏయిర్‌ క్రాప్ట్‌ విడిభాగాల కొనుగోలుకు సంబంధించి, రక్షణ శాఖకు సంబంధించి ఆయుధాల విడిభాగాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారని జాతీయ మీడియాలో ప్రసారం అయ్యిందన్నారు. ఆయుధాల డీలర్‌ సంజయ్‌ భండారీతో అశోక్‌ గజపతిరాజు ఓఎస్‌డీ అప్పారావుకు సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ ఓఎస్‌డీ నారా లోకేష్‌కు అత్యంత అప్తుడని చెప్పారు. ప్రభుత్వ రంగసంస్థ అయిన ఏయిర్‌పోర్టులో అవినీతికి పాల్పడ్డారన్నారు.

విమానయాన శాఖలో ఈ నాలుగేళ్లలో అవినీతి జరిగిందని విమర్శించారు. తప్పులు చేసి ఇవాళ పెద్ద మనిషిలా చెలామని అవుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి - అశోక్‌ గజపతిరాజు ఏయిర్‌ ఏషియా కుంభకోణంపై ప్రజలకు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. మీరే నిస్వార్థపరులు - నీతిమంతులైతే నిరూపించుకోవాలని ఆయన సవాల్‌ విసిరారు. చంద్రబాబు తన సింగపూర్ పర్యటనలో స్కాంలు ఉన్నవారిని కలిసింది నిజమా కాదా చెప్పాలని బొత్స సత్యనారాయణ అన్నారు. సింగపూర్ లాబీకి రూ.12 కోట్లు ఇచ్చింది వాస్తవమా, కాదా చెప్పాలన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టులో వాటాలు కుదరక రద్దు చేసింది నిజమా, కాదా చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు ఎన్నో కుంభకోణాల్లో ఉన్నారన్నారు. ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే కోర్టుల నుంచి చంద్రబాబు స్టేలు తెచ్చుకొని తప్పించుకుంటున్నారన్నారు. చంద్రబాబు నిజాయితీ పరుడిగా మేలి ముసుగు కప్పుకొని పబ్బం గడుపుకుంటున్నారన్నారు.