Begin typing your search above and press return to search.

బుట్టా విజ్ఞత- తెదేపాలో ఎవరికీ లేదా?

By:  Tupaki Desk   |   22 July 2017 4:31 AM GMT
బుట్టా విజ్ఞత- తెదేపాలో ఎవరికీ లేదా?
X
తెలుగుదేశం పార్టీ కేంద్రంలో పాలన సాగిస్తున్న భాజపాకు మిత్రపక్షమే కావొచ్చు. అంత మాత్రాన కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం వాటిని ప్రస్తావించకుండా మడికట్టుకుని కూర్చోవాలనే నిబంధన ఏమీ లేదు. ఇవాళ్టి పరిస్థితుల్లో కొత్తగా విధించిన జీఎస్టీ పన్నుల వల్ల ఏపీలో అసలే కునారిల్లుతున్న చేనేత రంగం మరింత ఘోరంగా దెబ్బతినిపోయే దుస్థితి ఎదురవుతున్నప్పుడు.. చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీని రద్దు చేయాలనే డిమాండ్ ను తెలుగుదేశం పార్టీ తమ బాధ్యతగా భావించకపోవడం ఘోరం అని ప్రజలు తిట్టిపోస్తున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక స్థిరమైన స్టాండ్ తీసుకుంది. కేంద్రం విధించిన జీఎస్టీ బిల్లుకు తాము కూడా మద్దతు తెలియజేసినప్పటికీ.. రాష్ట్రంలో చేనేత రంగం కునారిల్లిపోకుండా.. ఈ ఉత్పత్తులపై మాత్రం దీనిని తొలగించాలంటూ తమ వాదన వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన ఎంపీ బుట్టా రేణుక లోక్‌ సభలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. చేనేత ఉత్పత్తుల మీద జీఎస్టీ వేయడం తగదని, కష్టాల్లో ఉన్న నేత కార్మికులకు ఆ ఉపాధి కూడా పోతుందని పేర్కొన్నారు.

అయితే ఆ పాటి శ్రద్ధను సంఖ్యాపరంగా ఎక్కువమంది ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం ఇక్కడ గమనార్హం. తమ అధినేత చంద్రబాబునాయుడు కీ ఇచ్చి పంపించిన మేరకు తెదేపా ఎంపీల నుంచి నిధులు నిధులు అనే మాటలు తప్ప.. పొరబాట్న కూడా ప్రజలు ప్రజలు అనే మాటలు రావడం లేదని జనం జోకులేసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ లోని కొత్త ఎంపీ బుట్టా రేణుక కు ఉన్నపాటి విజ్ఞత కూడా తెలుగుదేశం లోని సీనియర్లకు లేకపోతే ఎలాగ? అని ప్రశ్నిస్తున్నారు.