Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్ పాదయాత్రతో పులకరించిన తెలుగుగడ్డ: ఐవీ రెడ్డి

By:  Tupaki Desk   |   9 April 2017 10:01 AM GMT
వైఎస్ ఆర్ పాదయాత్రతో పులకరించిన తెలుగుగడ్డ: ఐవీ రెడ్డి
X
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు ప్రజల గోడు వినే నాధుడు లేక సంక్షేమం కాక క్షామం తాండవిస్తున్న నేలపై ఓ వెలుగు రేఖలా నిలిచాడు రాజశేఖరుడు. అప్పటికే నయవంచకుల పాలనలో విసిగి వేసారిన ప్రజలకు తమ సమస్యల కోసం పోరాడే ఓ నాయకుడు ఆయన రూపంలోనే కనిపించాడు. అప్పటి దాకా తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని నీలి నీడలు కమ్ముకున్న అభివృద్ధిని తిరిగి తమ వాకిళ్ళలోకి తీసుకొచ్చే ఆపద్భాందవుడి కోసం ఎదురు చూస్తున్న పేద గుండెలకు తానే అన్నయ్యగా మారడానికి ముందుకు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రజా క్షేమం తప్ప మరో లక్ష్యం తన రాజకీయ జీవితానికి లేదు అని పదే పదే చెబుతూ వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు కొనఊపిరి వరకు అదే మాటకు కట్టుబడ్డారు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా, డాక్టర్ చదువు తనకు గొప్ప ఆదాయ వనరులను ఎరగా చూపినా వాటికి లొంగకుండా తదేక కృషితో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా మొదలైన తన ప్రస్థానాన్ని కోట్లాది ప్రజల హృదయాల్లో శాశ్వతంగా కొలువు తీరిన ముఖ్య మంత్రి స్థాయికి చేరుకోవడంలో ఆయన చిందించిన ప్రతి చెమట చుక్క వెనకాల మన కంటికి కనిపించిన నిద్ర లేని రాత్రిళ్ళు, ఆకలి మరిచిన రోజులు లెక్కబెట్టలేనన్ని ఉన్నాయి. జనమైనా, అనుచరగణ మైనా ఆయన్ని పూజించడానికి కారణం ఆయన దక్షత, దీక్ష అంతకు మించి ఎంతటి పట్టుదల.

తన రాష్ట్రంలో ప్రజలు జానెడు పొట్ట నింపుకోవడం కోసం పగలనక రేయనక మండుటెండలను సైతం లెక్క చేయక అహోరాత్రాలు కష్టపడుతుంటే వాళ్ళ బాగు కోరే నాయకుడిగా తాను ఎసి రూముల్లో కూర్చుని మంతనాలు చేస్తే లాభం లేదని అర్థం చేసుకున్న రాజశేఖర్ రెడ్డి గారు ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నారు. ప్రజా క్షేత్రానికి వెళ్ళాలంటే కారుల్లో, విమానాల్లో కాదు దేవుడిచ్చిన పాదాలతోనే తనకు నిజ సాక్షాత్కారం కలుగుతుందని అర్థం చేసుకున్న ఆయన మొక్కవోని దీక్షతో పాదయాత్రకు సిద్ధపడ్డారు. పాదాలు పది అడుగులు నడిస్తేనే కందిపోతాయి అని భావించే నాయకులున్న రోజుల్లో 1986లో లేపాక్షి నుంచి పోతిరెడ్డి పాడు వరకు 300 కిలోమీటర్లు రాయలసీమ హక్కుల సాధన కోసం పాదయాత్ర చేయటం ఇప్పటికీ అక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. 55 ఏళ్ళ ముదిమి వయసులో దేశ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు చేయని రీతిలో 1600 కిలోమీటర్లు నడిచి శత్రువుల మనసులు కూడా గెలవడం ఒక్క రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యం అయ్యింది. అప్పటి దాకా అధికారాన్ని అనుభవిస్తూ అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న తెలుగుదేశానికి సరైన ప్రత్యాన్మాయంగా కాంగ్రెస్ పార్టీని నిలపడంలో ఆయన చేసిన కృషి ఇప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్న కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు. తన మాటతో, నమ్మకాన్ని కలిగించే నిజమైన హామీలతో చంద్రబాబు నాయుడు ని కుర్చీకి తొమ్మిదేళ్ళ పాటు దూరం చేసిన ఘనత ఈయనదే. ఎన్నో ప్రజా హిత పధకాలతో ఇప్పటికీ అందరి మనస్సులో శాశ్వత స్థానం సంపాదించుకున్న రాజశేఖర్ గారి పాద యాత్రను తర్వాతి కాలంలో చంద్ర బాబు లాంటి వాళ్ళు అనుకరించే ప్రయత్నం చేసినా జనం నమ్మలేదు సరికదా ఛీ కొట్టినంత పని చేసారు. రాజసం - నమ్మకం - నిజాయితీ - కట్టుబాటు - సేవా గుణం - నిష్పాక్షపాతం లాంటి లక్షణాలు పుణికి పుచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి గారి స్థానంలో వేరొకరిని ఊహించుకోవడానికి ఎవరికి మనసొప్పలేదు. అందుకే రెండో అధికరం ఆయనను కోరి మరీ వరించింది. ఆయన అమరుడు కావడం దైవ లిఖితం కావొచ్చు కాని ఆయన మాత్రం జనం గుండెల్లో ఎప్పటికి సజీవంగా ఉండటం వాళ్ళ మనో లిఖితం.


-ఐవీ రెడ్డి,
గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా.