Begin typing your search above and press return to search.

కొడాలికి తిప్పలు షురూ.. ఈసారికి ఎదురుగాలే.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   9 Aug 2022 12:30 AM GMT
కొడాలికి తిప్పలు షురూ.. ఈసారికి ఎదురుగాలే.. అదెలానంటే?
X
అన్ని నియోజకవర్గాలు ఒకలా ఉండవు. అందరు నేతలు ఒకే మాదిరి ఉండరు. కొన్ని నియోజకవర్గాలు కొందరు నేతల కోసమే అన్నట్లుగా ఉంటాయి. వారిని తప్పించి.. మిగిలిన వారి గురించి ఆలోచించటానికి ఇష్టపడరు. కొందరు ప్రముఖ నేతల చుట్టూ తిరిగే ఈ నియోజకవర్గాలు వారికి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అలాంటి కంచుకోటలాంటి నియోజకవర్గాల్ని తయారు చేసుకున్న నేతల్లో వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడను చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నిక అయితే చాలు కొడాలికి తప్పించి మరెవరికీ అవకాశం లేదన్నట్లుగా ఇక్కడ పరిస్థితి ఉంటుందని చెబుతారు.

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ నేతగా సుపరిచితుడైన కొడాలి నాని.. తర్వాత వైసీపీలోకి వెళ్లటం ఒక ఎత్తు అయితే.. తన దూకుడుతనంతో టీడీపీ అధినేత మీద ఒంటికాలి మీద లేచే ఆయనకు చెక్ చెప్పాలన్న ప్రయత్నం ఇప్పటివరకు ఫెయిల్ అయ్యింది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఫలితం ఉండాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది. నిజం చెప్పాలంటే గుడివాడలో కొడాలిని ఢీ కొట్టేంత బలమైన నాయకుడు టీడీపీకి లేరు. ఈసారి అందుకు భిన్నంగా కొడాలిని ఎన్నికల్లో దెబ్బ తీసేందుకు అవసరమైన అన్ని బలాలు ఉన్న అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నారు.

వాస్తవానికి గత ఎన్నికల్లో కొడాలికి చెక్ చెప్పేందుకు.. ఆయన దూకుడుకు బ్రేకులు వేసేందుకు టీడీపీ పక్కా ప్లాన్ చేసింది. అందులో భాగంగా విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను ప్రయోగించింది. అయితే.. చంద్రబాబు అనుకున్న దానికి భిన్నమైన పరిస్థితులు ఉండటంతో ఆ ప్రయోగం ఫెయిల్ కావటమే కాదు.. సదరు అవినాష్ వైసీపీలోకి జంప్ కావటం టీడీపీకి బలమైన దెబ్బ పడింది. ప్రస్తుతం గుడివాడ పార్టీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు కొడాలికి చెక్ పెట్టేంత బలం లేదు. దీంతో కొత్త అభ్యర్థిని తెర మీదకు తీసుకురావాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున కసరత్తు మొదలుపెట్టారు.

సుదీర్ఘంగా సాగిన వెతుకులాటలో టీడీపీ గుర్తించిన అభ్యర్తిగా దేవినేని స్మిత విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. క్రిష్ణాజిల్లాలో రాజకీయ గురువుగా సుప్రసిద్ధులైన చలసాని పండు కుమార్తె ఈ స్మిత. వాస్తవానికి పెనమలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతగా సుపరిచితులైన చలసాని పండు ఇప్పుడు లేరు. దీంతో.. ఆయన రాజకీయ వారసురాలిగా స్మిత తెర మీదకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీ చేయాలన్నది ఆలోచన.

చంద్రబాబు.. లోకేశ్ సూచనతో ఆమె గుడివాడ బరిలోకి దిగాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే స్మితతో పవర్ ఫుల్ కొడాలికి చెక్ పెట్టటం సాధ్యమా? అంటే అవుననే చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెంది ఉండటం.. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం.. మహిల కావటం.. చలసాని అనుచరుల బలం.. టీడీపీ కార్డు.. ఇలా అన్ని ఆమెకు సానుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నారు.

కొడాలి నానికి మహిళల విషయంలో ఆయనకు అంత సానుకూలత లేని వేళ.. స్మితతో ఆయనకు దెబ్బ కొట్టొచ్చొన్న ఆలోచనతో టీడీపీ ఉన్నట్లు చెబుతున్నారు. మహిళా అభ్యర్థి బరిలో ఉన్నప్పుడు నోటిని ఏ మాత్రం అదుపులోకి పెట్టుకోకుండా మాట్లాడితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.