Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీతో వైసీపీ నేత భేటీ కలకలం!

By:  Tupaki Desk   |   10 Jan 2023 7:35 AM GMT
టీడీపీ ఎంపీతో వైసీపీ నేత భేటీ కలకలం!
X
ఆంద్రప్రదేశ్‌ లో ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ ను వైసీపీ నేత, మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు కలిశారు. ఈ మేరకు కేశినేని నేని భవన్‌ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.

ఎంపీ కేశినాని నానిని కలసిన వసంత నాగేశ్వరరావు కేశినేని నాని తాత కేశినేని వెంకయ్యతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే వీరిద్దరి మధ్య అనేక సామాజిక, రాజకీయా అంశాలు చర్చకు వచ్చాయని తెలుస్తోంది. కేశినేని రాజకీయాలకు అతీతంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నియోజకవర్గంలో చేపట్టడంపై వసంత నాగేశ్వరరావు ఆయనను ప్రశంసించారని కేశినేని భవన్‌ వర్గాలు వెల్లడించాయి. నిజాయితీ, నిబద్ధత గల నాయకుడిగా కేశినేని నాని ఎదగడాన్ని వసంత నాగేశ్వరరావు ప్రశంసించారని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఈ అంశం హాట్‌ టాపిక్‌ గా మారింది. వైసీపీలో ఉన్న వసంత నాగేశ్వరరావు ప్రత్యర్తి పార్టీ ఎంపీని కలవడం చర్చనీయాంశంగా మారింది. వసంత నాగేశ్వరరావు తనయుడు వసంత కృష్ణప్రసాద్‌ ప్రస్తుతం మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇటీవల కమ్మ వనసమారాధన సందర్బంగా జగ్గయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కమ్మలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక కమ్మ మంత్రి కూడా లేరని గుర్తు చేశారు. ఏపీలో కంటే తెలంగాణలోనే కమ్మలకు మంచి ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. తెలంగాణ కేబినెట్‌లో కమ్మ మంత్రి ఒకరు ఉన్నారని.. ఏపీలో ఒక్కరు కూడా లేకపోవడం దురదృష్టకరమన్నారు. అన్ని పార్టీల తరఫున దాదాపు 20 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఒక్కరికీ కూడా మంత్రి పదవి లేకపోవడం విచారకరమన్నారు.

ఎన్టీఆర్‌ యూనివర్సిటీకి పేరు మార్చినా ప్రశ్నించలేని స్థితిలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గంపై రాజకీయంగా దాడి చేస్తున్నా ఎందుకు స్పందిచడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో వివిధ సంస్థల పేర్లన్నీ నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, వైఎస్‌ రాజశేఖరరెడ్డిలతోనే ఉన్నాయన్నారు. వీటిని ఏ ప్రభుత్వాలు మార్చలేదన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి మాత్రం పేరు మార్చారన్నారు.

కమ్మలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వేరే వర్గం ఎమ్మెల్యేలున్నారని వసంత నాగేశ్వరరావు గుర్తు చేశారు. సొంత కులాన్ని వదిలేసి వేరే సామాజికవర్గాల పల్లకీలు మోయడం సరికాదన్నారు.

ఈ వ్యాఖ్యలపై వసంత కృష్ణప్రసాద్‌ వైఎస్‌ జగన్‌ను కలసి వివరణ కూడా ఇచ్చారు. తన తండ్రి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదున్నారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని వెల్లడించారు.

ఈ క్రమంలో మళ్లీ ఇప్పుడు వసంత నాగేశ్వరరావు.. విజయవాడ ఎంపీ కేశినేని నానిని కలవడంపై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచిచూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.