Begin typing your search above and press return to search.

నిర్బంధాల విమానాశ్రయం.. రాజమండ్రి

By:  Tupaki Desk   |   11 Jun 2016 10:12 AM GMT
నిర్బంధాల విమానాశ్రయం.. రాజమండ్రి
X
రాజమండ్రి నగరానికి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం ఆ ప్రాంతానికి అత్యంత కీలకమైనది. విశాఖ - విజయవాడల మధ్య ప్రాంతాల్లో ఎక్కడకు వెళ్లాలన్నా రాజమండ్రి విమానాశ్రయంలో దిగాల్సిందే. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాల నేపథ్యంలోనూ ఈ విమానాశ్రయం కీలకమే. అలాంటి రాజమండ్రి(మధురపూడి) విమానాశ్రయం విచిత్రంగా నిర్బంధాలకు నెలవవుతోంది. కొద్దికాలంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ కార్యకలాపాల నేపథ్యంలో అక్కడికి వస్తున్న నేతలను పోలీసులు మధురపూడి విమానాశ్రయంలోనే ఆపేస్తున్నారు. తాజాగా వైసీపీకి చెందిన బొత్స సత్యానారాయణ - అంబటి రాంబాబులను పోలీసులు మధురపూడిలో అడ్డుకుని అక్కడే నిర్బంధించారు.

కాపు ఉద్యమనేత - నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని పరామర్శించేందుకు రాజమండ్రికి వచ్చిన వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ -అంబటి రాంబాబులను పోలీసులు ఎయిర్ పోర్టులోనే నిర్భంధించారు. వారు వస్తారన్న సమాచారం తెలియడంతో రాజమండ్రి ఎయిర్ పోర్టు రోడ్డు వద్ద పోలీసులు ముందుగానే మోహరించారు. వారు విమానాశ్రయంలో దిగగానే అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఎయిర్ పోర్టు వద్ద వైసిపి నేతలు బొత్స - అంబటి - ఉమ్మారెడ్డి - సామినేని లు నిరసన తెలిపారు. అనంతరం వారిని అరెస్టు చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కాగా ఇంతకుముందు ముద్రగడ దీక్షకు దిగినప్పుడు కాంగ్రెస్ నేత చిరంజీవి ఆయన్ను కలిసేందుకు వచ్చారు. ఆ సందర్భంలో చిరంజీవిని కూడా మధురపూడి విమానాశ్రయంలోనే నిర్బంధించారు. అప్పటికి కిర్లంపూడిలో దీక్ష చేస్తున్న ముద్రగడను కలవకుండా చిరంజీవిని అడ్డుకుని మధురపూడి నుంచే మళ్లీ వెనక్కు పంపించారు. ఆ సమయంలో మరో కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావును కూడా రాజమండ్రిలోని ఆనంద్ రీజెన్సీలో నిర్బంధించారు. ఇలా కాపు ఉద్యమ నేపథ్యంలో రాజమండ్రి నిర్బంధాల నగరంగా... మధురపూడి ఎయిర్ పోర్టు నిర్బంధాల విమానాశ్రయంగా పేరుపడుతున్నాయి.