Begin typing your search above and press return to search.

మ‌హాపాద‌యాత్ర‌-2పై వైఎస్సార్సీపీ నేత‌ల‌ ఎటాక్ షురూ!

By:  Tupaki Desk   |   13 Sep 2022 6:34 AM GMT
మ‌హాపాద‌యాత్ర‌-2పై వైఎస్సార్సీపీ నేత‌ల‌ ఎటాక్ షురూ!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని అమ‌రావ‌తి రైతులు మ‌హాపాద‌యాత్ర‌-2కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని ప‌రిధిలోని వెంక‌ట పాలెం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అర‌స‌వ‌ల్లి సూర్య దేవాల‌యం వ‌ర‌కు పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. అమ‌రావ‌తి ఉద్య‌మం మొద‌లుపెట్టి 1000 రోజులు పూర్తి కావ‌డంతో సెప్టెంబ‌ర్ 12న అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు.. అనే పేరుతో ఈ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు.

ఈ పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమతి నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే రాజ‌ధాని రైతులు త‌మ‌కు అనుకూలంగా హైకోర్టు అనుమ‌తి తెచ్చుకున్నారు. అయినా స‌రే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. రైతుల పాద‌యాత్ర‌ను ఉత్త‌రాంధ్ర‌పై దాడిగా చిత్రీక‌రిస్తోంది. ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెంద‌కుడా చేయ‌డానికి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో 29 గ్రామాల రైతులు చేస్తున్న దండ‌యాత్ర‌గా దీన్ని అభివ‌ర్ణిస్తోంది.

ఇందుకు సంబంధించి రోజూ ఉత్త‌రాంధ్ర (శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్నం)కు చెందిన వైఎస్సార్సీపీ మంత్రులు గుడివాడ అమ‌ర్ నాథ్, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, సీదిరి అప్ప‌ల‌రాజు, విశాఖ ఇన్‌చార్జ్ మంత్రి విడ‌ద‌ల ర‌జని, స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాంల‌తోపాటు అధికార పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రైతుల పాద‌యాత్ర‌పై నిప్పులు చెరుగుతున్నారు. రైతుల పాద‌యాత్ర‌ను ఉత్త‌రాంధ్ర‌పై దాడిగా, దండ‌యాత్ర‌గా వ‌ర్ణిస్తూ ఉద్రిక్త‌త‌లు రెచ్చ‌గొట్ట‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ కోణంలోనే రైతుల పాద‌యాత్ర‌లో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తితే టీడీపీ అధినేత చంద్ర‌బాబుదే బాధ్య‌త అని మంత్రులు, అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. రైతులు వ‌చ్చినా అరస‌వ‌ల్లి సూర్య‌నారాయ‌ణ స్వామిని ద‌ర్శించుకుని మారుమాట్లాడ‌కుండా వెళ్లిపోవాల‌ని మాజీ డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్ వంటివారు హూంక‌రిస్తున్నార‌ని చెబుతున్నారు.
ఇప్ప‌టికే హైకోర్టులో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురు అయింది. మూడు రాజ‌ధానుల బిల్లుల‌ను హైకోర్టు కొట్టేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మూడు రాజ‌ధానులు పెట్టే విష‌యంలో కొన్ని మిన‌హాయింపుల‌కు లోబ‌డి ఎలాంటి అధికారం లేద‌ని హైకోర్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వం మంకుప‌ట్టు వీడ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జా సంఘాల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రైతుల పాద‌యాత్ర‌కు ఉత్త‌రాంధ్ర‌లో మంచి స్పంద‌న వచ్చినా, యాత్ర స‌జావుగా సాగినా జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు త‌ప్ప‌వు. ఇది అంతిమంగా టీడీపీకి మంచి చేస్తుంద‌నే అభిప్రాయం వైఎస్సార్సీపీలో వ్య‌క్త‌మ‌వుతోంద‌ని చెబుతున్నారు. అందుకే ఈ పాద‌యాత్ర‌పై వైఎస్సార్సీపీ, మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వం విరుచుకుప‌డుతున్నాయి. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప‌దే ప‌దే త‌మ ప్ర‌సంగాల్లో రైతుల పాద‌యాత్ర‌తో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య త‌లెత్తుతుంది అని చెప్ప‌డం వెనుక మ‌ర్మం అంద‌రికీ అర్థ‌మ‌య్యే ఉంటుంద‌ని అంటున్నారు.

వెనుకబ‌డిన ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెంద‌వ‌ద్దా? అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృత‌మైతే మ‌ళ్లీ తెలంగాణ మాదిరి ప్ర‌త్యేక ఉద్య‌మాలు వ‌స్తాయి.. ఉత్తరాంధ్ర ప్ర‌జ‌లు వ‌ల‌స కూలీలుగానే ఉండిపోవాలా అంటూ వైఎస్సార్సీపీ నేత‌లు పాద‌యాత్ర‌పై మండిప‌డుతున్నారు. అది 29 గ్రామాల ఉద్య‌మం అని, రాష్ట్ర ఉద్య‌మం కాద‌ని, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెనుక ఉండి ఈ పాద‌యాత్ర‌ను చేయిస్తున్నార‌ని అధికార పార్టీ నేత‌లు తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు.

రైతుల పాద‌యాత్ర‌పై వైఎస్సార్సీపీ నేత‌లు ముప్పేట దాడి చేస్తున్న నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎలా దారితీస్తాయోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. రైతుల పాద‌యాత్ర ఉత్త‌రాంధ్ర‌కు చేరగానే వైఎస్సార్సీపీ నేత‌లు ఏం చేస్తారోన‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.