Begin typing your search above and press return to search.

వైఎస్ చేసిందే చంద్రబాబూ చేశారు

By:  Tupaki Desk   |   6 Aug 2015 11:30 AM GMT
వైఎస్ చేసిందే చంద్రబాబూ చేశారు
X
జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్... ఈ సంస్థకు ప్రాస్పెక్టివ్గ్ లీజు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ వైసీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. సాక్షి పత్రిక దీనిపై కథనమే రాసింది.. జియో మైసూర్ కు ప్రాస్పెక్టివ్ లీజు ఇవ్వడం ఘోరమంటూ కథనం రాసింది.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది కేవలం ప్రాస్పెక్టివ్ లీజు మాత్రమేనని.... వైఎస్ హయాంలో ఏకంగా మైనింగ్ లీజుకు ఆమోదించారన్న సంగతి మాత్రం మరుగున పెట్టేస్తున్నారు. తాము చేస్తే ఒప్పు.. చంద్రబాబు చేస్తే తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తూ ప్రజల్లో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు.

నిజానికి గనుల లైసెన్సుల్లో మూడు దశలుంటాయి.. మొదటిది రికాసిన్స్ లైసెన్సు.. అంటే ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించడానికి అనుమతి. అక్కడ సంబంధిత ఖనిజానికి సంబంధించిన లభ్యత, నాణ్యత వివరాలు తెలుసుకునే పరీక్షలు అవీ చేయొచ్చు. ఆ తరువాత దశ ప్రాస్టెక్టివ్ లైసెన్సు... చివరి దశలో మైనింగ్ లైసెన్సు ఇస్తారు. ఇప్పుడు చంద్రబాబు ఇచ్చింది కేవలం రెండో దశ పరిశీలనకు ప్రాస్పెక్టివ్ లైసెన్సు మాత్రమే. ఇది ఇచ్చినంత మాత్రాన గనుల లైసెన్సు ఇచ్చినట్లు కాదు.

కాగా ఇదే జియో మైసూర్ సంస్థకు 2008లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 1457 ఎకరాలకు మైనింగ్ లైసెన్స్ ఇస్తూ ఏకంగా ఆమోదం తెలిపారు. అంతకుముందు పరిశీలన కోసం 70 వేల ఎకరాల్లో రికాసిన్స్ లైసెన్సు ఇచ్చారు. అంటే వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జియోమైసూర్ కు మైనింగ్ లైసెన్సు ఇచ్చారన్నమాట.

ఈ కంపెనీ బెంగళూరులో ఉంది... దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన కొందరు ప్రమోటర్లుగా వ్వవహరిస్తున్నారు. కాకతాళీయమో, కుంభకోణమో తెలియదుకానీ 2004లో వైఎస్ సీఎం అయిన నెల రోజులకే ఈ జియో మైసూర్ సంస్థ కర్నూలు జిల్లాలో బంగారం, వెండి, రాగి మైనింగుకు దరఖాస్తు చేసింది. ఇది వివిధ దశల్లో ప్రాసెస్ అయిన తరువాత 2008 జనవరిలో ఈ కంపెనీకి 1457 ఎకరాలు మైనింగ్ కు ఓకే చెప్పారు. ఇప్పుడు అదే కంపెనీకి చిత్తూరు జిల్లాలో మైనింగ్ కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రాస్టెక్టివ్ లీజు ఇస్తే జగన్ పత్రిక లో కథనాలు రాశారు. లొసుగులు ఉంటే ఎత్తిచూపితే ఎవరూ కాదనరు... కానీ... పనిగట్టుకుని రాయడంపైనే విమర్శలొస్తున్నాయి. వైఎస్ చేసిందంతా మర్చిపోయి ఇప్పడు చంద్రబాబుపై నిందలేస్తున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.