Begin typing your search above and press return to search.

మిత్రాగ్రహం; మా పార్టీలు మార్చేస్తారేంటి కేసీఆర్‌..!

By:  Tupaki Desk   |   11 Jun 2015 5:57 AM GMT
మిత్రాగ్రహం; మా పార్టీలు మార్చేస్తారేంటి కేసీఆర్‌..!
X
ప్రత్యర్థుల మీద పంచ్‌లు వేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తాజాగా మిత్రుల మీద కూడా వేశారా? అన్న ప్రశ్న వెంటాడుతోంది. పార్టీ ఫిరాయించిన వ్యవహారానికి సంబంధించి ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించిన దానికి కౌంటర్‌గా.. సదరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు స్పందించటం గమనార్హం.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌తో రహస్య స్నేహం ఉందని ప్రచారం సాగే క్రమంలో.. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఏపీలో అధికారపక్షం వైపు ఉన్నట్లుగా కేసీఆర్‌ వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. తాము పార్టీ మారకున్నా.. తమ పార్టీ మార్చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సదరు ఎమ్మెల్యేలు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాము వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నామని.. కేసీఆర్‌ అవగాహనారాహిత్యంతో మాట్లాడవద్దని వారు వ్యాఖ్యానించారు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం ఏమిటంటూ వారు గయ్యిమంటున్నారు.

బుధవారం రాత్రి మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌.. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు (విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌.. కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పులేని కల్పన.. ప్రకాశం జిల్లాకు చెందిన గొట్టిపాటి రవికుమార్‌.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్‌ ముస్తఫా.. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి) అధికార తెలుగుదేశం పార్టీలో చేరారని.. దీనికి బాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించటం తెలిసిందే. అయితే.. తాము పార్టీ మారలేదని.. చివరి వరకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోనే కొనసాగుతామని వారు చెబుతున్నారు. మొత్తానికి పక్క రాష్ట్ర రాజకీయాలు మాట్లాడి కేసీఆర్‌ తప్పులో కాలేసినట్లున్నారే..!