Begin typing your search above and press return to search.

చంద్రబాబు అలా చేయడం వల్లే కందుకూరు ఘటన: కొడాలి నాని విసుర్లు!

By:  Tupaki Desk   |   29 Dec 2022 4:52 AM GMT
చంద్రబాబు అలా చేయడం వల్లే కందుకూరు ఘటన: కొడాలి నాని విసుర్లు!
X
ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో టీడీపీ నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన కార్యక్రమంలో విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారీగా జనాలు హాజరవడంతో తొక్కిసలాట జరిగి 8 మంది మరణించారు. మరో నలుగురు ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో ఉన్నారు. ఈ ఘటన అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.

కందుకూరు సభకు భారీగా జనాలు హాజరైనా పోలీసులు సరైన భద్రత కల్పించలేదని టీడీపీ విమర్శిస్తోంది. మరోవైపు చంద్రబాబు ప్రచార పిచ్చితోనే కందుకూరులో 8 మంది మృతి చెందారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు.

ఇరుకు సందుల్లో సభలు వద్దని చెబుతున్నా వినకుండా ఇరుకు సందుల్లో సభ పెట్టాడని తీవ్ర విమర్శలు చేశారు. పబ్లిసిటీ స్టంట్‌ కోసమే కందుకూరులో చంద్రబాబు సభ నిర్వహించాడని కొడాలి నాని ధ్వజమెత్తారు. ఫలితంగా 8 మంది అమాయకులు మృతి చెందారని నాని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా చంద్రబాబు ప్రచార పిచ్చి తగ్గించుకోవాలని కొడాలి నాని సలహా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానన్నారు. ఈ మేరకు కొడాలి నాని ట్వీట్‌ చేశారు.

దీనికి టీడీపీ మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ కౌంటర్‌ ఇచ్చారు.. 'బాబు నెల్లూరు లో ఉన్నది మొత్తం మీ ఎమ్మెల్యేలే, కనీసం డ్రెయిన్‌ కాలువ మీద దిమ్మలు కూడా వేయలేని చేతగాని ప్రభుత్వం అని ఒప్పుకో, ఇంకో ఏడాది ఆగు.. నీ బలుపు దిగుతుంది' అని ఈ విమర్శల వేడిని మరింత పెంచారు.

అలాగే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీ వాణి సైతం చంద్రబాబు సభపై ఘాటుగా ట్వీట్‌ చేశారు. సభకు ఎక్కువ మంది వచ్చారని డ్రోన్‌ కెమెరా షాట్ల ద్వారా చూపించడానికి కందుకూరు సభలో అందరినీ ఒకేవైపు టీడీపీ నాయకులు నిలబెట్టారని మండిపడ్డారు. ఫలితంగా తోపులాట జరిగి 8 మంది మృతి చెందారని ధ్వజమెత్తారు. చంద్రబాబు–కోకి అమాయకుల ప్రాణాల కన్నా పబ్లిసిటీనే ముఖ్యమా? అని నిలదీశారు.

ఇలా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ నేతలు శవాలు మీద చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతుంటే.. చంద్రబాబు ప్రచార పిచ్చితోనే 8 మంది మృతి చెందారని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.