Begin typing your search above and press return to search.

సీఎం ఇంటి పక్కనే కబ్జా..బయటపెట్టిన వైసీపీ నేతలు

By:  Tupaki Desk   |   13 May 2019 2:29 PM GMT
సీఎం ఇంటి పక్కనే కబ్జా..బయటపెట్టిన వైసీపీ నేతలు
X
ఆంధ్రప్రదేశ్‌ లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత ఎన్నో అక్రమాలు - అవినీతి పనులు బయటికొచ్చాయి. ఐదేళ్ల కాలంలో ఆ పార్టీ నాయకులు ఏమాత్రం తగ్గకుండా అక్రమాలు చేసుకుంటూ పోయారు. కొండలు - గుట్టలు - నదులు - అడవులు ఇలా వేటినీ వదలకుండా సొమ్ము చేసుకున్నారు. అభివృద్ధి చేస్తారన్న నమ్మకంతో అందలమెక్కిస్తే - సహజ వనరులను సైతం వదలకుండా దోచుకున్నారు. ప్రభుత్వ పథకాల్లో కూడా ఇదే తరహా అవినీతి సాక్షాత్కరించింది. పథకాలు అమలు చేసే క్రమంలో వాటి తాలూకు నిధులను పక్కదారి పట్టించిన ఘనత తెలుగు తమ్ముళ్లకే దక్కింది. ప్రాజెక్టుల విషయంలోనైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం - పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అంచనాలను మించిపోయి ఖర్చు చేస్తున్నారు.

వీటికితోడు ఇసుక మాఫియాకైతే అడ్డూ అదుపు అనేదే లేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే దీనిని అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మెర్వోను టీడీపీ ఎమ్మెల్యే కొట్టిన ఘటన సంచలనం అయింది. అప్పుడు దీనిని హైలైట్ కాకుండా జాగ్రత్త పడి తప్పించుకున్నారు. ఇక, ఆ తర్వాత ఎన్నో పథకాలను రూపొందించి చాలా డబ్బును వెనకేసుకున్నారు. కొన్ని విషయాల్లోనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు - మంత్రి లోకేష్‌ పైనే ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి. స్టేలు తెచ్చుకోవడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. ఇలాంటి వాటి నుంచి ఇట్టే తప్పించుకోగలిగారు. ఐదేళ్ల కాలంలో మరోసారి ఛాన్స్ వస్తుందో రాదో అన్నంతగా చంద్రబాబు.. టీడీపీ నేతలకు దోచుకోవడంలో అవకాశం ఇచ్చారనే కామెంట్లు తరచూ వినిపిస్తూ ఉండేవి.

వీటిని పక్కనపెడితే.. తాజాగా మరో అవినీతి బట్టబయలైంది. ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలో ఉన్న కృష్ణా నదిని కబ్జా చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెట్టారు. అయితే, ఇది ప్రైవేటు వ్యక్తి పేరు మీద ఉన్నదని నీటి పారుదల అధికారులు చెబుతున్నారు. గతంలోనూ కృష్ణా నది ఒడ్డున కబ్జా చేశారు. ఇసుక బస్తాలను వేశారు. అప్పుడు కూడా వైసీపీ నాయకులు అధికారుల దృష్టికి తీసుకెళ్తే బస్తాలను మాత్రం తొలగించారు. ఇప్పుడేమో కబ్జా కాలేదు అని వాళ్లే చెబుతున్నారు. దీంతో అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు సీఎం ఇంటి సమీపంలోనే జరగడంతో - ఇందులో టీడీపీ నేతల హస్తం ఉందన్న దానికి బలం చేకూరుతోంది.